సాక్షి, కడప / అగ్రికల్చర్ : ఎంకి పెళ్లి సుబ్బిచావు కొచ్చినట్లుంది జిల్లా కేంద్రంలోని పలు శాఖల అధికారులు పరిస్థితి. ప్రతి క్షణం ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. కాదు.. పోము.. అంటే కుదరదు. అందునా ప్రభుత్వ ఉద్యోగం. ప్రోటోకాల్ కావడంతో అల్లాడిపోతున్నారు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు వారంరోజులుగా ప్రతిరోజు వస్తున్న ప్రముఖుల సేవలో ప్రభుత్వ అధికారులు నలిగిపోయారు. వద్దురా సామీ.. ఈ విధులు అంటూ కొట్టుకుంటున్నారు. మంత్రులు, వీఐపీల వెంట వచ్చే చోటా మోటా నేతలఆర్డర్లతోనే అధికారులు అదిరిపోతున్నారు. ఇది కావాలి, అది కావాలి అంటూ మంత్రుల వెంట వచ్చేవారు ఆదేశాలు ఇస్తుండడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి దీక్ష కారణంగా అధికారులకు నిద్ర ఉండటం లేదు. ఒకపక్క ప్రొటోకాల్, మరోపక్క దీక్షకు సంఘీభావాల నేపథ్యంలో జన సమీకరణతో అల్లాడిపోయారు.
తమ్ముళ్లతో తంటా!
దీక్షకు సంఘీభావం తెలుపడానికి వచ్చే మంత్రులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రొటోకాల్ కలిగిన సంస్థల అధ్యక్షులు ఆర్‌అండ్‌బీలో దిగుతున్నారు. ఈ సందర్భంలో వారి అనుయాయుల హడావుడి అంతా ఇంతా కాదు. వారి కోర్కెలు తీర్చడం పలుశాఖల్లో ప్రొటోకాల్ చూసే అధికారుల చేతిచమురు వదులుతోందని ఆందోళన చెందుతున్నారు. ఉద యం పూట తెలుగు తమ్ముళ్లు తమకు టిఫెన్లు ఏర్పాటు చేయాలని, మధ్యాహ్నం ఖరీదైన భోజనాలు తెప్పించి ఉం చాలని ఆదేశించడం పరిపాటిగా మారిం దని అధికారులు వాపోతున్నారు. పోతూపోతూ తమ వాహనాలకు డీజిల్ పట్టించుకుని మరీ వెళుతున్నారు.
మంత్రుల హడావుడి..
అధికారుల గడిబిడి
రోజూ మంత్రుల హడావుడి ఉంది. ప్రతిక్షణం వారి రాక కోసం కొందరు అధికారులు బొకేలు అందించడం, తర్వాత దీక్ష ప్రాంగణానికి తీసుకెళ్లే వరకు బాధ్యతలతో బిజీబిజీగా కనిపిస్తున్నారు. అలాగే మంత్రుల రెస్ట్ కోసం విశ్రాంతి భవనాలకు తీసుకు వెళ్లడం, ఇతర అవసరాల మేరకు అందుబాటులో ఉండడంతోపాటు మంత్రుల విభాగాలకు సంబం«ధించిన జిల్లా అధికారులు కూడా ప్రొటోకాల్ ప్రకారం కనిపిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా మంత్రుల పర్యటనలతో అధికారులు వారంరోజులుగా అల్లాడిపోతున్నారు. అలాగే జిల్లాకు మంత్రులు, వీఐపీలు, ఎంపీలు, సినీ ప్రముఖులు రాకతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. వారం రోజులుగా ఎయిర్‌పోర్టు నుంచి దీక్షా శిబిరం వరకు మంత్రులను తీసుకు రావడం, రోడ్డు మార్గాన వచ్చేవారికి ఎక్కడికక్కడ వెంట బందోబస్తుతోపాటు దీక్షాశిబిరం వద్ద వీఐపీల తాకిడి నేపథ్యంలో బందోబస్తు విధుల్లో జిల్లా పోలీసు యంత్రాంగానికి నిద్రలేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment