ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరులో ప్రభుత్వ భూముల సంతర్పణ ప్ర క్రియ మూడు పువ్వులు, ఆరు కాయల చందం గా కొనసాగుతోంది.
పీలేరు, న్యూస్‌లైన్:
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరులో ప్రభుత్వ భూముల సంతర్పణ ప్ర క్రియ మూడు పువ్వులు, ఆరు కాయల చందం గా కొనసాగుతోంది. స్థానికేతరులకు పట్టాల పంపిణీ పరంపర కొనసాగుతోంది. పీలేరు శివారు ప్రాంతం నాగిరెడ్డి కాలనీ సమీపంలోని సర్వే నెంబరు 72/2లో 12మందికి పట్టాలు ఇచ్చిన వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది.
పంచాయతీ ఎన్నికల నజరానాలో భాగంగా ప్రభుత్వ సిబ్బందికి కూడా ఇక్కడ పట్టాలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నారుు. రెండు రోజులుగా సర్వే నెంబర్ 72/ 2లోని గుట్టలను, పెద్ద పెద్ద వృక్షాలను ఇటాచీలతో గుట్టుచప్పుడు కాకుండా కూల్చి చదును చేస్తున్నారు. మూడు తరాలుగా ఈ భూములను అనుభవిస్తున్న స్థానికులు కొందరు మంగళవారం ఈ విషయం తెలుసుకుని అక్కడికి చే రుకుని పనులను అడ్డగించారు. దీంతో పరి స్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఓ దశలో పోలీసులు, రెవెన్యూ అధికారులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. తాము అనుభవిస్తున్న స్థలాన్ని ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎలా చదును చేస్తారని నిలదీశారు. తాము పెంచిన పెద్ద పెద్ద వృక్షాలను సైతం పెకలించడం ఎంత వరకు సమంజసమని, సమ్మెలో ఉన్న అధికారులు వి ధుల్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. అధికారు లు మాట్లాడుతూ గత మే నెలలోనే 19 మందికి ఇళ్ల పట్టాలు జారీ చే శారని తెలిపారు. పోలీసు లు సర్దిచెప్పడంతో స్థానికులు వెళ్లిపోయూరు.
స్థానికేతరులకే పట్టాలు..
72/2లో పట్టాలు తీసుకున్న వారిలో ఉపాధి హామీ, ఐకేపీకి చెందిన అధికారులు, సిబ్బంది, వారి బంధువులు ఉండడం గమనార్హం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేశారన్న కృతజ్ఞతతో పట్టాలు మంజూరు చేసినట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి.
మూడు తరాలుగా అనుభవంలో ఉంది
మూడు తరాలుగా ఈ భూములు జోలికి ఎవరూ రాలేదు. పీలేరు పట్టణం, మండలానికి సంబంధం లేని వారికి పట్టాలు ఎలా ఇస్తారు ?. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకుని ఇలా చేసి ఉంటారనే అనుమానం కలుగుతోంది. ఇంత దారుణంగా గతంలో ఎన్నడూ ప్రభుత్వ భూములను సంతర్పణ చేయలేదు.
-వీ.రాజారెడ్డి, స్థానికుడు.
మాకు తెలియకుండానే ఎలా పట్టాలు ఇస్తారు
గుట్టలను సైతం కూల్చి పట్టాలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద గుట్టలను ఇటాచీలతో చదును చేసి ఇళ్ల స్థలాలుగా ఇవ్వాల్సిన అవసరమేమొచ్చింది. మా పొలాల వద్దకు వెళ్లాలన్నా దారి లేకుండా పోతోంది. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. -గుర్రం వెంకట్రమణారెడ్డి, స్థానికుడు.