గాలిలో దీపం
- దీపం పథకం కింద జిల్లాకు 31,159 కనెక్షన్లు మంజూరు
- పూర్తికాని లబ్ధిదారుల ఎంపిక
- జూన్ నాటికే కనెక్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశం
- ఓపెన్ కాని దీపం వెబ్‌సైట్
- మూడేళ్లలో మంజూరై, గ్రౌండు కాని 69,273 కనెక్షన్లు రద్దు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: దీపం పథకం కింద పేదలకు ఇచ్చే గ్యాస్ కనెక్షన్ల మంజూరులో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏటా జిల్లాకు వేల సంఖ్య లో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పేదలందరికీ మాత్రం చేరడం లేదు. లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. 2011-14 అంటే మూడేళ్లలో సాధారణ, ప్రత్యేక కేటగిరీలో జిల్లాకు 87,271 కనెక్షన్లు మంజూరు కాగా, ఇందులో కేవలం 17,998 కనెక్షన్లు మాత్రమే లబ్ధిదారుల కు ఇచ్చారు.
మిగిలిన 69,273 కనెక్షన్లను పెం డింగ్‌లో ఉంచారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గత మూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న గ్యాస్ కనెక్షన్లను రద్దు చేసింది. తాజాగా జిల్లాకు 31,159 కనెక్షన్లను మంజూరు చేశారు. వీటిని కూడా జూన్ లోపల గ్రౌండ్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇంతవరకు లబ్ధిదారుల ఎంపిక జరిపి వారికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన దాఖలాలు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. ఏటా జరిగే తంతు మాదిరి ఈసారీ జరుగుతుందేమోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తులు ఎంపీడీవో కార్యాలయంలో ఇచ్చి దీపం కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
లబ్ధిదారులను ఎంపిక ఇలా..
మండలంలో దరఖాస్తులను ఏంపీడీవోలకు అందజేయాలి. అందులో అర్హులైన వారిని గుర్తించి వారి దరఖాస్తులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. రూరల్ పరిధిలో డీఆర్‌డీఏ పీడీకి, నగర, పట్టణ పరిధిలో అయితే కమిషనర్‌కు జాబితాను అందజేస్తారు. వీరు ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో తుది జాబితాను ఎంపిక చేసి లిస్టును గ్యాస్ ఏజెన్సీలకు పంపుతారు. దీనికి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను తయారు చేసింది. రెండు నెలలుగా ఆ వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల దరఖాస్తులను అప్‌లోడ్ చేయలేదు. చివరకు ఈ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో తాజాగా ఈనెల 17వ తేదీన ఈపీడీఎస్ వెబ్‌సైట్‌లోనే దరఖాస్తులను అప్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. దీంతో ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.