ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఉట్నూర్ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతుందని ఆశించిన గిరిజనుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. నిర్మల్‌లో యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించడంతో గిరిజన యూనివర్సిటీపై నీలినీడలు కమ్ముకున్నాయి.
కేంద్ర కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లు పదకొండో అంశంలో గిరిజన యూనివర్సిటీ అంశం ఉంది. ఉట్నూర్‌లో గిరిజనులు అధికంగా ఉండటంతో ఇక్కడే ఏర్పాటు చేస్తారని అడవిబిడ్డలు ఆశలు పెంచుకున్నారు. ప్రస్తుతం నిర్మల్‌లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు.
2008 నుంచి యూనివర్సిటీ ప్రస్తావన
కేంద్ర ప్రభుత్వం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు 2008 నవంబర్ 17న జీవో నంబర్ 797ను విడుదల చేసింది. కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2011 ఆగస్టు 27న జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు జీవో నంబర్ 783ను జారీ చేసింది. ఇలా కేంద్ర, రాష్ట్రాల ప్రకటనతో ఏజెన్సీ కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటవుతుందని భావించిన జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనకాల 470 ఎకరాల ప్రభుత్వ పరం పోగు భూమిలో 300 ఎకరాలు గుర్తించారు.
అలాగే ఏడో నంబరు జాతీయ రహదారికి 34 కి.మీ.ల దూరంలో రవాణా సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్తు సౌకర్యాలు ఉన్నట్లు ఐటీడీఏ, జిల్లా అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. దీనికి తోడు యూనివర్సిటీని ఏజెన్సీ కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ 2008 నుంచి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుతో ఏజెన్సీలో యూనివర్సిటీ ఏర్పాటవుతుందని గిరిజనులు అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం నిర్మల్‌లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడంతో గిరిజనులు మండి పడుతున్నారు. జిల్లా ఒక్క యూనివర్సిటీ ఏర్పాటు జరిగిందంటే ఏజెన్సీ కేంద్రంలో మరో యూనివర్సిటీ ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చని పరిశీలకులు పేర్కొంటున్నారు. దీంతో యూనివర్సిటీ ఏర్పాటు కలగా మారుతుందని గిరిజనులు అవేదన వ్యక్తం చెస్తూన్నారు.
గిరిజన యూనివర్సిటీ కలేనా?
Published Sat, Feb 1 2014 6:48 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement