మామూళ్లపైనే నజర్ | Government officials blackmail rice millers | Sakshi
Sakshi News home page

మామూళ్లపైనే నజర్

Published Thu, Sep 12 2013 1:10 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

Government officials blackmail rice millers

హుజూరాబాద్, న్యూస్‌లైన్ : ‘నా మిల్లులో ఉన్న తాలు బియ్యాన్ని చూసి ఇవి రేషన్ బియ్యమని, సీజైన మిల్లులో బియ్యమెలా ఉంటాయని బ్లాక్‌మెయిల్ చేస్తే రూ.36 వేలు ఇచ్చా. మళ్లీ అవే బియ్యాన్ని కారణంగా చూపిస్తూ ప్రతీసారి మామూళ్లు అడిగితే కాదన్నా... అందుకే నా మిల్లులో తనిఖీలు చేయించారు.’ - హుజూరాబాద్‌లోని శోభ రైస్‌మిల్లు యజమాని శీల శ్రీనివాస్ ఆవేదన ఇది. హుజూరాబాద్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సురేందర్ తనను ప్రతీసారి బ్లాక్‌మెయిల్ చేస్తూ మిల్లులో సోదాలు జరిపిస్తామని బెదిరిస్తూ వేధిస్తున్నాడని మిల్లులో మంగళవారం తనిఖీల సమయంలో బహిరంగంగానే ఆరోపించారు.
 
  జిల్లాలో అంతటా ఇదే పరిస్థితి ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మిల్లర్లు గుట్టుచప్పుడు కాకుండా అక్రమాలు చేస్తుండగా పసిగడుతున్న అధికారులు ములాఖత్ అవుతున్నారే తప్ప వాటి గుట్టు విప్పడం లేదు. మామూళ్లు ఇచ్చినప్పుడు చూసీ చూడనట్లు వ్యవహరించడం... ఇవ్వకపోతే తనిఖీలు చేసి కేసులు పెట్టడం సాధారణమైపోయిందని పలువురు మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు ఈ పనిని చక్కగా నెరవేరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాను డబ్బులు ఇవ్వనందుకే తహశీల్దార్‌ను పిలిపించి తనిఖీలు చేయించారని, ఈ వ్యవహారం వెనక ఆర్‌ఐ సురేందర్ ఉన్నారని, న్యాయం తనవైపే ఉందని, ఏ విచారణకైనా సిద్ధమని, కలెక్టర్, జేసీ, ఏసీబీ డీఎస్పీలకు ఫిర్యాదు చేస్తానని శోభ మిల్లు యజమాని శ్రీనివాస్ అందరిముందే చెబుతున్నాడంటే అధికారుల తీరు ఎలా ఉందో తెలుస్తోంది. కొందరు మిల్లర్లు మాత్రం తమకొందుకొచ్చిన గొడవలే అన్నట్లు అధికారులను మచ్చిక చేసుకుంటున్నారు. ఇలాంటి అధికారులపై ఫిర్యాదు చేస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించి వారికి ఆమ్యామ్యాలు ముట్టజెప్పి తమ అక్రమాలు సాగిస్తున్నారు. అందుకే తనిఖీలు... కేసుల నమోదు నామమాత్రంగా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 సీజైన బియ్యం తరలింపు
 హుజూరాబాద్ మండలం బోర్నపల్లి శివారులోని శోభ ఇండస్ట్రీస్‌లో మంగళవారం రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి పట్టుకున్న 116.5 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు శ్రీరామ రైస్‌మిల్లుకు తరలించారు. మిల్లు యజమాని శ్రీనివాస్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. బుధవారం తహశీల్దార్ సురేశ్, సివిల్ సప్లయ్ డెప్యూటీ తహశీల్దార్ ఎలమంద, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పంచనామా నిర్వహించి ఈ బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించి మరో మిల్లుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement