కమీషన్ చెల్లించని ప్రభుత్వం
జుత్తాడ ఇసుక ర్యాంపుల్లో ఉద్యమించిన మహిళలు
హనాలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
కమీషన్ చెల్లించే వరకు విరమించేది లేదని స్పష్టీకరణ
అడ్డుకుంటే అరెస్టు చేస్తాం : పోలీసుల హెచ్చరిక
జుత్తాడ గ్రామంలోని ప్రభుత్వ ఉచిత ఇసుక ర్యాంపు వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాకు చెల్లించాల్సిన కమీషన్ డబ్బులు ఇచ్చే వరకు ఒక్క లారీని కూడా వెళ్లనీయమని డ్వాక్రా మహిళలు భీష్మించి కూర్చున్నారు. అడ్డుకుంటే అరెస్టు చేస్తామని పోలీసులు, అధికారులు హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. ఒక దశలో అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నింనా కమీషన్ చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదనిమహిళలు స్పష్ట చేయడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. - చోడవరం
గతంలో అధికారిక ఆన్‌లైన్ ఇసుక తవ్వకాల సమయంలో ఈ రీచ్ నిర్వహణ డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. వాటికి సంబంధించిన కమీషన్ ప్రభుత్వం ఇప్పటికీ తమ ఖాతాల్లో జమచేయలేదని డ్వాక్రా మహిళలు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, అధికారులు తమను మోసం చేశారంటూ ఆగ్రహిస్తూ పెద్ద ఎత్తున వారు ఉచిత ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. రెండ్రోజులుగా లారీల నుంచి కొంత సొమ్మును కూడా వారు వసూళ్లు చేస్తున్నారు. దీనిపై లారీ యజమానులు పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు రావలసిన కమీషన్ వచ్చేవరకు వసూలు చేస్తామని మహిళలు స్పష్టం చేశారు.
మోసగించిన ప్రభుత్వం
ఈ నేపథ్యంలో తవ్వకాలను అడ్డుకుంటే అరెస్టు చేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చోడవరం పోలీసులు భారీగా మహిళా పోలీసులతోపాటు వాహనాలను కూడా తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలంతా వందలాదిగా ర్యాంప్ దగ్గరికి వచ్చారు. ఇంతలో తహసీల్దార్ పి.రామునాయుడు, ఎస్‌ఐ రమణయ్య, ర్యాంప్ ఇన్‌చార్జి అధికారి ఇరిగేషన్ ఏఈ వచ్చి డ్వాక్రా సంఘాలతో సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఉచిత ఇసుక ర్యాంప్ వద్ద వసూళ్లు చేయకూడదని, అడ్డం పెట్టకూడదని వారు హెచ్చరించారు. దీనిపై ఆగ్రహించిన మహిళలు తమను ప్రభుత్వం మోసంచేసిందని, రావలసిన కమీషన్ డబ్బులు ఇప్పటికీ వేయకపోవడం వల్లే మేము ఈవిధంగా చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఇసుకను ఎమ్మెల్యేలు, మంత్రులు, పోలీసు అధికారులకంటూనే వేలాది లారీలు తరలించుకుపోయారని, సామాన్య జనం ఎవరూ రాలేదని మహిళలు ధ్వజమెత్తారు. పది రోజుల్లో కమీషన్ డబ్బులు వేస్తామని ఉన్నతాధికారులు చెప్పారని మహిళలకు తహసీల్దార్ తెలిపారు. అయినా స్థానిక మహిళలు, రైతులు శాంతించలేదు.
తవ్వకాలతో పంట కాలువలకు నష్టం
శారదానదిలో తమ గ్రామం వద్ద ఇసుకను పూర్తిగా ఇప్పటికే తవ్వేశారని, నదిని ఆనుకొని ఉన్న పంటకాలువలకు 10 అడుగుల కిందకు లోతుగా తవ్వేశారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీనివల్ల నదిలో నీరు కాలువల్లోకి వెళ్లే అవకాశం లేనందున వ్యవసాయానికి సాగునీటికే ఇబ్బంది ఏర్పడే ప్రమాదం వచ్చిందని రైతులు ధ్వజమెత్తారు. ఇక్కడ ఇసుక తవ్వకాలు చేయవద్దని నీరు లేక పంటలు ఎండిపోయి తాము కూడా వలసలు పోయే పరిస్థితి తేవద్దని రైతులు వేడుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ తొమ్మిది వేల క్యూబిక్‌మీటర్ల ఇసుక ఉచితంగా తవ్వడానికి అనుమతి ఉందని అధికారులు చెప్పడంతో మేము లారీలను వెళ్లనీయమని మహిళలు భీష్మించుకొని కూర్చుకున్నారు. వివాదం ముదరడంతో లారీలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. తాత్కాలికంగా ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. నిబంధన ప్రకారం ఇసుక తవ్వకాలు జరుగుతాయని పోలీసులు చెబుతూ పహారా కాశారు. సాయంత్రం వరకు మహిళలు కూడా ఇక్కడ ఉండిపోవడంతో ఇసుక తరలింపు మాత్రం ఒక కొల్కిరాలేదు.
తవ్వకాలు నిలిపివేయాలి
ఇసుక లేకపోయినా నదిని తవ్వేస్తున్నారు. కాలువల్లోకి నీరు రాక పంటలు కూడా ఎండిపోతున్నాయి. డిగ్రీ చదువుకున్న ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు వారికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయకపోగా మా వ్యవసాయం కూడా దెబ్బతినేలా చేస్తున్నారు. నదిలో ఇసుక తవ్వేసి కాలువల్లోకి సాగునీరు పారకుండా చేస్తున్నారు. రైతులు కూడా వలసలు పోయి అడుక్కుతినేలా సీఎం వ్యవహరిస్తున్నారు. ఇసుక తవ్వకాలు వెంటనే నిలిపివేయకుంటే ఉద్యమిస్తాం. -మళ్ల అప్పలనర్సమ్మ, డ్వాక్రా మహిళ, రైతు, జుత్తాడ.