హైదరాబాద్‌లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం
కులగణన పూర్తిచేసేలా అధికారుల చర్యలు
మేయర్ పీఠం దక్కించుకునేందుకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ కసరత్తు
తిరుపతి: కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి కార్పొరేషన్ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. వివిధ కారణలతో ఎన్నికలు జరగకుండా ఆగిపోయిన తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి కార్పొరేషన్‌లకు సంబంధించిన ఎన్నికల నిర్వహణపై ఇటీవలే హైదరాబాద్‌లో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సంబంధించి గణన చేపట్టేందుకు వీలుగా ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు రానున్నట్లు కార్పొరేషన్ వర్గాలు పేర్కొన్నాయి. వార్డుల రిజర్వేషన్ల తతంగం ముగిసేందుకు రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలిసింది. తిరుపతి మున్సిపాలిటీ 2007 మార్చి 2వ తేదీన కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. అప్పటిలో ఉన్న 36 వార్డులను 50 డివిజన్‌లుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోక ముందు 2007లో మేయర్ పీఠం ఎస్టీలకు రిజర్వ్ అయింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టు కెళ్లడంతో ఎన్నిక వాయిదా పడింది. ఏపీ విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన 13 కార్పొరేషన్‌లలో రిజర్వేషన్ల పరంగా తిరుపతి కార్పొరేషన్‌ను జనరల్ మహిళకు కేటాయించారు. తిరుపతి కార్పొరేషన్‌లో తిమ్మనాయుడుపాళెం, ఎంఆర్‌పల్లి, రాజీవ్‌నగర్ పంచాయతీలను 2013 జూన్‌లో కార్పొరేషన్‌లో విలీనం చేశారు. ప్రస్తుతం తాజాగా కులగణన జరిగితే మేయర్ పీఠంకు సంబంధించి రిజర్వేషన్‌లలో మార్పు జరిగే అవకాశం ఉంది.
నవంబర్‌లో ఎన్నికలు జరపాలని..
ఎన్నికను జూన్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నేరవేర్చకపోవడంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర అగ్రహంతో ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ప్రభుత్వానికి నివేదికలు చేరాయి. దీనికితోడు వేసవి కావడంతో విద్యుత్తు, నీటి సమస్యలు నగరవాసులను వెంటాడుతున్నాయి. ఈ ప్రభావం కార్పొరేషన్ ఎన్నికలపై పడుతుందని ప్రభుత్వం భయపడుతున్నట్లు సమచారం. ముఖ్యంగా నగరంలో కార్పొరేషన్ ఎన్నికల్లో డ్వాక్రా మహిళలదే కీలక పాత్ర. వారికి సంబంధించి ప్రభుత్వ ం ఇంతవరకు రుణాలను మాఫీ చేయలేదు. దీంతో వారు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీని ప్రభావం ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందని ఇప్పటికే దేశం వర్గాలు అంచనాకు వచ్చాయి. జూన్‌లో ఎన్నికలు జరిపితే ఎదురీత తప్పదని, వీటిని నవంబరులో జరిపితే కొంతమేర ఊరట చెందవచ్చునని అంచనా వేస్తున్నాయి. ఆలోపు కనీసం పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తే గండం నుంచి గట్టెక్క వచ్చునని టీడీపీ ఆలోచిస్తోంది.
పార్టీలు సమాయత్తం..
కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించి ఇన్‌చార్జులుగా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిలను నియమించారు. కార్పొరేషన్ పీఠం దక్కించుకునేందుకు వీలుగా నగరంలోని ముఖ్యనేతలతో సమావేశమవుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నారు. తెలుగుదేశం పార్టీ సైతం డివిజన్‌లలో పార్టీ అధ్యక్షుల నియామకాలతో పాటు నగర అధ్యక్ష ఎన్నికలను పూర్తిచేసి కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది.
కార్పొరేషన్ ఎన్నికలకు సర్కార్ సన్నాహాలు
Published Wed, Apr 29 2015 2:50 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement