సాక్షి, నిజామాబాద్ : కస్టం మిల్లింగ్ కోసం ప్రభుత్వం ఇచ్చి న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని నిర్ణీత సమయంలో ఎఫ్‌సీఐకి సరఫరా చేయడంలో మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నా రు. లక్షల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని తమ వ్యాపార అవసరాల కోసం వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరాకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సెప్టెంబరుతో ముగిసినప్పటికీ మిల్లర్లు స్పందించడం లేదు. ఇంకా సుమారు 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తమ వద్దే ఉంచుకున్నారు. ఒక్కో టన్ను బియ్యం విలు వ సుమారు రూ. 23 వేలు ఉంటుంది. ఈ లెక్కన మిల్లర్ల వద్ద ఉన్న బియ్యం విలువ సుమారు రూ.25 కోట్లకు పైగానే ఉంటుం దని అంచనా.
జాప్యం వెనుక ఆంతర్యం
రైతుల ధాన్యానికి మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తుంది. ఇలా సేకరించిన ధాన్యాన్ని జిల్లాలో ఉన్న రైసుమిల్లులలో బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ)కి అప్పగిస్తుంది. ఇలా ధాన్యాన్ని ఆడించినందుకు మిల్లర్లకు క్వింటాలుకు రూ. 15 నుంచి రూ. 25 వరకు మిల్లింగ్ చార్జీలు చెల్లిస్తుంది. దీనితోపాటుగా నిర్వహణ వ్యయం నిమిత్తం స్టోరేజీ చార్జీలు కూడా ఇస్తుంది. ఇలా అన్నీ కలిపి లక్షల రూపాయల చార్జీలను చెల్లిస్తుంది. నిబంధనల ప్రకారం మిల్లర్లు తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని 15 రోజులలో ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ మిల్లర్లు నెలల తరబడి జాప్యం చేస్తుండడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.
ఇదీ పరిస్థితి
2012 సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో సేకరించిన ధాన్యంలో 37,962 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ నిమిత్తం 52 మిల్లులకు కేటాయించారు. ఇందుకుగాను మిల్లర్లు 25,602 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాలి. కానీ మిల్లర్లు 18,759 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. మళ్లీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా మిల్లరు 6,843 మెట్రిక్ టన్నుల బియ్యం తమ వద్దే ఉంచుకున్నారు.
రబీ సీజను
రబీ కొనుగోలు సీజన్‌కు సంబంధించి 17,012 మెట్రిక్ టన్నుల ధాన్యం కస్టం మిల్లింగ్ చేసి 11,568 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాలి. కానీ కేవలం 7,341 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇంకా 4,227 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వడంలో సుమారు 20 మంది మిల్లర్లు నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. అంటే ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి మొత్తం 11,070 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిపడ్డారు. ఈ కస్టం మిల్లింగ్‌ను పర్యవేక్షించాల్సిన పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ వ్యవహారాన్ని ‘మామూలు’గా తీసుకోవడంతో మిల్లర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం : శ్రీనివాస్, ఏజీపీఓ
కస్టం మిల్లింగ్ బియ్యం బకాయి పడిన రైసుమిల్లర్లపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సివిల్‌సప్లయ్ కార్పొరేషన్ నుంచి నోటీసులు వెళ్లాయి. 15 రోజుల్లో పూర్తి స్థాయిలో బియ్యం రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టాం. ప్రభుత్వం డిసెంబర్ నెలాఖరు వరకు గడువిచ్చింది. తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మిల్లర్ల గుప్పిట్లో సర్కారు బియ్యం
Published Sat, Oct 26 2013 3:13 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement