సాక్షి, మంచిర్యాల :
అధికారుల నిర్లక్ష్యానికిదో తార్కాణం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో వారి వైఫల్యానికి నిదర్శనం. పథకాల ప్రచారం చేయాల్సిన మైనార్టీ సంక్షేమ శాఖ తనకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తోంది. దీంతో అర్హులు లబ్ధికి నోచుకోవడం లేదు. నిరుపేద ముస్లిం యువతులకు చేయూత అందజేయడంలో అధికారుల అసమర్థతను నిలదీయలేని, ప్రశ్నించలేని జిల్లా ప్రజల మనోవేదనను అర్థం చేసుకున్న ప్రవాసాంధ్రులు(ఎన్‌ఆర్‌ఐ) జిల్లాలో నిరుపేదలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. పేద ముస్లిం యువతుల వివాహాల కోసం రూ.25 వేల ఆర్థికసాయం అందించాలని సంకల్పించారు. ముందుగా కేవలం మంచిర్యాల పట్టణంలోనే స్థానిక ప్రజలతో మైనార్టీ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థికసాయం కోసం అభ్యర్థులు నేరుగా కమిటీని సంప్రదిస్తున్నారు. నెల వ్యవధిలోనే ఈ కమిటీ మూడు పెళ్లిళ్ల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఈ కమిటీ వద్ద నిరుపేద యువతీలకు ఇచ్చేందుకు రూ.1.50 లక్షలు మాత్రమే ఉన్నాయి. అయినా.. అర్హులైన వారిని గుర్తించి ఆర్థికసాయం అందించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు.
అధికారి లేడు.. ప్రచారం కరువు..
ఈ ఏడాది జూన్‌లో మైనార్టీ వెల్ఫేర్ అధికారి అజహరొద్దీన్ ఉద్యోగ విరమణ చేశారు. ఉపాధి కల్పన అధికారి గప్ఫార్ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇన్‌చార్జి అధికారి ఈ పథకంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదు. ఫలితంగా ఒక్క దరఖాస్తు కూడా కార్యాలయానికి రాలేదు. రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉంది. పథకం ప్రచారం లోపంతో దరఖాస్తులు రాక ఏటా నిధులు వస్తున్న శాఖలోనే మూలుగుతున్నాయి. ఇప్పటికీ జిల్లాలో 50 పెళ్లిళ్లు జరిపేందుకు అధికారుల వద్ద నిధులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది తమ కార్యాలయానికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదని గఫ్ఫార్ తెలిపారు. కానీ చాలా మంది నిరుపేద ముస్లింలు మసీదులు, ముస్లిం స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో సుమారు 53 మసీదులున్నాయి. రోజు సగానికి పైగా మసీదుల్లో నిరుపేద ముస్లిం యువతుల పెళ్లిళ్ల కోసం ఆర్థికసాయం చేయాలని ప్రకటిస్తూనే ఉన్నారు.
ఆర్థికసాయం ఇలా..
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిరుపేద ముస్లిం యువతుల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం రూ.25 వేల ఆర్థికసాయం అందిస్తోంది. ఇందులో పెళ్లి ఖర్చుల కోసం రూ.10 వేల నగదుతోపాటు రూ.15 వేలతో 2 గ్రాముల బంగారం, స్టీల్ సామాను, బీరువా, మంచం నూతన వధువరులకు కానుకగా ఇస్తుంది. ఆర్థికసాయం కోసం తెల్లరేషన్ కార్డుతోపాటు సంబంధిత ఫారాన్ని భర్తీ చేసి ఆదిలాబాద్‌లోని మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్‌గా డీఆర్వో రాజ్, కన్వీనర్‌గా మైనార్టీ వెల్ఫేర్ అధికారిపాటు మరో ముగ్గురు ఉన్నారు. కమిటీ సభ్యులు రేషన్‌కార్డులో దరఖాస్తుదారురాలు(వధువు) పేరు, వయస్సు 18 ఉందా లేదా నిర్ధారించుకుని ఆర్థికసాయం అందిస్తారు.
నిబంధనల కొర్రీ
ఆర్థికసాయం కోరాలని ఉన్నా చాలా మంది నిరుపేద యువతులు ప్రభుత్వ నిబంధనలు చూసి వెనకడుగు వేస్తున్నారు. సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం, వివాహాలకు జిల్లా అధికారులు రావడ ం.. జంటలతో ఫొటోలు దిగుతుండడంతో ఇష్టం లేని కొందరు పెళ్లి కొడుకులు సామూహిక వివాహాలైతే సంబంధం రద్దు చేసుకోవాలని యువతి కుటుంబీకులతో తెగేసి చెబుతున్నారు. మరోపక్క.. పెళ్లి తేది నిశ్చయమైన తర్వాత యువతీ కుటుంబీకులు ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ రోజు కనీసం మూడు జంటలు పెళ్లికి సిద్ధంగా ఉంటేనే ఆర్థికసాయం అందిస్తామని లేకపోతే పెళ్లి తేది మార్చుకోవాలని అధికారులు చెప్తున్నారు. దీంతో యువతీ కుటుంబీకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇదిలావుంటే.. మహారాష్ట్రలో దరఖాస్తు చేసుకున్న ముస్లిం యువతులకు అక్కడి ప్రభుత్వం రూ.25 వేలు చెక్కు రూపంలో అందిస్తోంది. పెళ్లి అయిన తర్వాత పెళ్లి పత్రాల జిరాక్స్ కాపీ సంబంధిత కార్యాలయానికి పంపిస్తే సరిపోతుందని ఆదేశించింది. అయితే విధానాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేస్తే బాగుంటుందని.. ఎన్నో జంటలు ముందుకు వచ్చి పెళ్లిళ్లు చేసుకునే వీలుంటుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కాగా, ప్రభుత్వం తన వంతు ఆర్థికసాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. కానీ లబ్ధిపొందాల్సిన వారు జిల్లాలో చాలా మంది ఉన్నారు. ప్రభుత్వంతోపాటు ప్రవాసాంధ్రులూ నిరుపేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు..’ అని ముస్లిం వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కమిటీ కోశాధికారి ముహమ్మద్ అబ్దుల్ ఖాలీఖ్ చెప్పారు.
పథకం లక్ష్యం : ముస్లిం యువతులకు ఆర్థికసాయం
అమలు చేసే శాఖ : మైనార్టీ సంక్షేమం
2011-12లో పెళ్లిళ్లు: 10
2012-13లో.. : 04
ఈ ఏడాది : ఒక్క దర ఖాస్తు కూడా రాలేదు
మూలుగుతున్న నిధులు : రూ.12.50 లక్షలు
‘సాయం’ కరువు
Published Tue, Dec 17 2013 5:16 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
Advertisement
Advertisement