Minority communities
-
పాక్‌లో బ్రిగేడియర్‌గా తొలిసారి... మైనారిటీ మహిళ
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మైనారిటీ వర్గానికి చెందిన తొలి మహిళా బ్రిగేడియర్‌గా హెలెన్ మేరీ రాబర్ట్స్ చరిత్ర నెలకొల్పారు. ఆమె 26 ఏళ్లుగా సైన్యంలో పని చేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ కార్ప్స్లో సీనియర్ పాథాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పాక్ జనాభాలో 96.47 శాతం మంది ముస్లింలే. హిందువులు 2.14%, క్రైస్తవులు 1.27% దాకా ఉంటారు. -
‘అప్పుడు మైనార్టీలకు అన్యాయం జరిగినా ఎల్లో మీడియా సైలెంట్‌గా ఉంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. కాగా, అంజాద్ బాషా మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కేబినెట్లో మైనార్టీకు స్థానం కూడా ఇవ్వలేదు. మైనార్టీలను చంద్రబాబు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు. అప్పట్లో మైనార్టీలకు అన్యాయం జరిగినా ఎల్లో మీడియా సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు చిలవలు పలవలుగా తప్పుడు ప్రచారం చేస్తోంది. రోజురోజుకు అభద్రతా భావంతో చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అని ప్రజలను అడుక్కుంటున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ మభ్యపెడుతున్నారు. మైనార్టీలపై చంద్రబాబు, ఆయన బ్యాచ్ దొంగ ప్రేమ చూపిస్తుంటే బాధగా ఉంది. మైనార్టీలను అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ హయంలో చంద్రబాబు.. మైనార్టీలకు ఎం చేశాడో, ఏం ఇచ్చాడో ప్రజలకు బాగా తెలుసు. మైనార్టీల సంక్షేమం కోసం 20 వేల కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత మా ప్రభుత్వానిది. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎల్లో మీడియా కథనాలను ప్రచురించాలి. ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం మాది’ అని స్పష్టం చేశారు. -
అతను అలా ఉండటం వల్లే...మంత్రి పదవి దక్కింది
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే బీజేపీకి ముస్లిం మైనారిటీల మంత్రిగా డానిష్ ఆజాద్ అన్సారీని నియమించినట్లు బీజేపీ వెల్లడించింది. అన్సారీ బలియా జిల్లా నివాసి, యూపీ ప్రభుత్వం ఉర్దూ భాషా కమిటీలో సభ్యుడు కూడా. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా సేవలందించారు. అన్సారీ తన రాజకీయ జీవితాన్ని లక్నో విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎబీపీలో ఆయన అనేక పదవులు నిర్వహించారు. యువకులు, మైనారిటీ వర్గాల్లో ఆయన నిరంతరం చురుగ్గా వ్యవహరిస్తుండడమే ఆయనకు మంత్రి పదవి రావడానికి కారణంగా భావిస్తున్నారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలు, యువత అభ్యున్నతికి కట్టుబడి ఉందని గతంలో ఆయన చెప్పారు. విద్యా ప్రమాణాలు పెంచడం, మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా నొక్కి చెప్పారు. శ్రీకాంత్ శర్మ, సతీష్ మహానా, మహేందర్ సింగ్, సిద్ధార్థ్ నాథ్ సింగ్, నీలకాంత్ తివారీ, మొహసిన్ రజాలు ఈసారి కేబినెట్‌కు దూరమయ్యారు. కిక్కిరిసిన లక్నో స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు, బాలీవుడ్ తారలు హాజరైన వేడుకలో యోగి ఆదిత్యనాథ్ 37 ఏళ్ల రికార్డుతో రెండోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన కేశవ్ ప్రసాద్ మౌర్యను ఉప ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. యోగి ఆదిత్యనాథ్‌తో పాటు 52 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 నియోజకవర్గాలకు గాను 255 స్థానాల్లో విజయం సాధించి 41.29 శాతం ఓట్లతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుంది. రాష్ట్రంలో పూర్తి పదవీకాలం పూర్తయిన తర్వాత 37 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి ముఖ్యమంత్రి. (చదవండి: ప్చ్.. ఆయనొక బీజేపీ నేత.. పేరు మాత్రం ‘కాంగ్రెస్’!) -
నిందితుడికి ఉరిశిక్ష వేయాలి: సీతక్క
సాక్షి, రాజేంద్రనగర్: మహిళలకు, మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నామని అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకోవడం కాదు.. ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మైనారిటీ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మొయినాబాద్ మండలం హిమాయత్‌సాగర్‌లో ఇంటి యజమాని వేధింపులు తాళలేక ఓ మైనారిటీ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలిక సోదరి రాజేంద్రనగర్ బుద్వేల్ గ్రీన్ సిటీలో ఆశ్రమం పొందుతుండటంతో ఆమె మంగళవారం మధ్యాహ్నం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చదవండి: (యజమాని వేధింపులు: బాలిక ఆత్మహత్య ) ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడు మైనార్టీ కుటుంబానికి చెందిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. సంఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదన్నారు. నాలుగేళ్లుగా వెట్టిచాకిరీ చేయించుకొని అఘాయిత్యం చేశాడని ఆరోపించారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి ఉరి శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లుతోపాటు ఆర్థిక సహాయం చేయాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మృతురాలి సోదరికి ఉన్నత చదువుతో పాటు కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఘటనపై జిల్లా మంత్రితోపాటు హోంమంత్రి స్పందించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంతోపాటు మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు టీఆర్ఎస్ నేత కావడంతో అతడిని రక్షించేందుకు ప్రభుత్వం యత్నించిందని ఆరోపించారు. మైనార్టీల పక్షాన పోరాడుతున్నామని గొప్పలు చెప్పుకొనే ఓవైసీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కనీసం స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. నిందితుడు టీఆర్ఎస్ నేత కావడంతో మజ్లిస్ మిన్నకుండిపోయిందని విమర్శించారు. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. హర్యానాలో జరిగిన ఓ సంఘటనపై ట్వీట్ చేసిన ఓవైసీ తన ఇంటి పక్కనే మైనారిటీ బాలికపై జరిగిన అఘాయిత్యం విషయంలో స్పందించేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. తాము వాస్తవ పరిస్థితిని తెలుసుకునే యత్నం చేస్తుంటే అరెస్టులు చేస్తూ నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్క బాలిక సోదరికి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నేరేళ్ల శారద, మాజీ మంత్రి చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నేతలు ఇందిరారెడ్డి, శోభన, వర్రి లలిత్ ఉన్నారు. విచారణ వేగవంతం మొయినాబాద్(చేవెళ్ల): బాలిక అనుమానాస్పద మృతి కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు పంపిన పోలీసు ఉన్నతాధికారులు కేసు విచారణను వేగవంతం చేశారు. మంగళవారం శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి మొయినాబాద్ ఠాణాకు వచ్చారు. నిందితుడు మధుయాదవ్ గత పరిస్థితులు, కేసుల వివరాలను తెలుసుకున్నారు. మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌కు చెందిన బాత్కు మధుయాదవ్ ముందు నుంచి వివాదాస్పదంగా ఉండేవాడు. రియల్ వ్యాపారం చేస్తూ పలు భూములను వివాదాస్పదంగా మార్చడంతోపాటు సొంత బంధువులకు చెందిన భూమిని కూడా కబ్జాచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అతనిపై పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. గతంలోనే స్థానిక పోలీసులు అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఈ వివరాలన్నీ తెసుకున్న డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఘటన జరిగిన గదిలోని ఆనవాళ్లు, బాలిక సోదరి వెల్లడించిన విషయాలతో మధుయాదవ్ చేసిన దురాఘతాలపై తెలుసుకున్నారు. అదేవిధంగా ఘటన జరిగిన రోజున మొయినాబాద్ సీఐ జానయ్య వ్యవహరించిన తీరుపైనా డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆరా తీశారు. ఇప్పటికే కేసు విచారణాధికారిగా ఇన్స్పెక్టర్ జానయ్యను తప్పించి రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్‌చక్రవర్తికి అప్పగించారు. మరిన్ని వివరాల సేకరణ కోసం నిందితుడిని కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా నిందితుడిపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఐపై వేటుకు పెరుగుతున్న డిమాండ్ బాలిక మృతి కేసులో మొయినాబాద్ సీఐ జానయ్య వ్యవహరించిన తీరుపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు. దీనికి తోడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రజాసంఘాల నాయకులు సైతం ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విషయంలో హోంమంత్రి మహమూద్‌అలీ, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. -
పేదల అభ్యున్నతి కోసమే పార్టీ ఏర్పాటు
ఏటూరునాగారం, న్యూస్‌లైన్ : నిరుపేదల అభ్యున్నతి కోసమే మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ)ని స్థాపించామని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శుక్రవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో ఎంఎస్పీ జెండాను అనంతరం సభలో ఆయన మాట్లాడారు. బడుగుబల హీన వర్గాల అభివృద్ధిని ప్రస్తుత పాలకు విస్మరించారని, కేవలం వారి స్వలాభాల కోసం తాపత్రయ పడుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఏనాడూ ఆ వర్గాల కోసం అసెం బ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. వికలాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకు లు ఆచరలో పెట్టడం లేదన్నారు. ఎన్నికల సమ యం సమీపిస్తుండడంతో అనేక పార్టీల నాయకులు ఓట్ల కోసం ప్రజలను మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మంద కృష్ణ మండిపడ్డారు. పాలకులు మారుతున్నారే గానీ ప్రజల తలరాత మారడం లేదన్నారు. మహాజన సోషలిస్టు పార్టీతో రాజ్యాధికారం చేపట్టి స్వరాష్ట్ర పాలనను సాధించుకుందామని పిలుపునిచ్చారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవాలని చూస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రతి తెలంగాణ వాది సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. అనంతరం ఇగ్నో యూనివర్సీటీ ఫ్రొఫెసర్ రీయాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని, దొరల తెలంగాణ కాదన్నారు. తెలంగాణలో ఉన్న పార్టీలు కేవలం సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని, ప్రజలకోసం కాదన్నారు. పేదలు దుర్భర జీవితాలను గడుపుతున్నారని, ధనికులు మాత్రం మేడలపై మేడలు కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘సాయం’ కరువు
సాక్షి, మంచిర్యాల : అధికారుల నిర్లక్ష్యానికిదో తార్కాణం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో వారి వైఫల్యానికి నిదర్శనం. పథకాల ప్రచారం చేయాల్సిన మైనార్టీ సంక్షేమ శాఖ తనకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తోంది. దీంతో అర్హులు లబ్ధికి నోచుకోవడం లేదు. నిరుపేద ముస్లిం యువతులకు చేయూత అందజేయడంలో అధికారుల అసమర్థతను నిలదీయలేని, ప్రశ్నించలేని జిల్లా ప్రజల మనోవేదనను అర్థం చేసుకున్న ప్రవాసాంధ్రులు(ఎన్ఆర్ఐ) జిల్లాలో నిరుపేదలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. పేద ముస్లిం యువతుల వివాహాల కోసం రూ.25 వేల ఆర్థికసాయం అందించాలని సంకల్పించారు. ముందుగా కేవలం మంచిర్యాల పట్టణంలోనే స్థానిక ప్రజలతో మైనార్టీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థికసాయం కోసం అభ్యర్థులు నేరుగా కమిటీని సంప్రదిస్తున్నారు. నెల వ్యవధిలోనే ఈ కమిటీ మూడు పెళ్లిళ్ల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఈ కమిటీ వద్ద నిరుపేద యువతీలకు ఇచ్చేందుకు రూ.1.50 లక్షలు మాత్రమే ఉన్నాయి. అయినా.. అర్హులైన వారిని గుర్తించి ఆర్థికసాయం అందించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. అధికారి లేడు.. ప్రచారం కరువు.. ఈ ఏడాది జూన్‌లో మైనార్టీ వెల్ఫేర్ అధికారి అజహరొద్దీన్ ఉద్యోగ విరమణ చేశారు. ఉపాధి కల్పన అధికారి గప్ఫార్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇన్చార్జి అధికారి ఈ పథకంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదు. ఫలితంగా ఒక్క దరఖాస్తు కూడా కార్యాలయానికి రాలేదు. రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉంది. పథకం ప్రచారం లోపంతో దరఖాస్తులు రాక ఏటా నిధులు వస్తున్న శాఖలోనే మూలుగుతున్నాయి. ఇప్పటికీ జిల్లాలో 50 పెళ్లిళ్లు జరిపేందుకు అధికారుల వద్ద నిధులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది తమ కార్యాలయానికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదని గఫ్ఫార్ తెలిపారు. కానీ చాలా మంది నిరుపేద ముస్లింలు మసీదులు, ముస్లిం స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో సుమారు 53 మసీదులున్నాయి. రోజు సగానికి పైగా మసీదుల్లో నిరుపేద ముస్లిం యువతుల పెళ్లిళ్ల కోసం ఆర్థికసాయం చేయాలని ప్రకటిస్తూనే ఉన్నారు. ఆర్థికసాయం ఇలా.. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిరుపేద ముస్లిం యువతుల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం రూ.25 వేల ఆర్థికసాయం అందిస్తోంది. ఇందులో పెళ్లి ఖర్చుల కోసం రూ.10 వేల నగదుతోపాటు రూ.15 వేలతో 2 గ్రాముల బంగారం, స్టీల్ సామాను, బీరువా, మంచం నూతన వధువరులకు కానుకగా ఇస్తుంది. ఆర్థికసాయం కోసం తెల్లరేషన్ కార్డుతోపాటు సంబంధిత ఫారాన్ని భర్తీ చేసి ఆదిలాబాద్‌లోని మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్‌గా డీఆర్వో రాజ్, కన్వీనర్‌గా మైనార్టీ వెల్ఫేర్ అధికారిపాటు మరో ముగ్గురు ఉన్నారు. కమిటీ సభ్యులు రేషన్‌కార్డులో దరఖాస్తుదారురాలు(వధువు) పేరు, వయస్సు 18 ఉందా లేదా నిర్ధారించుకుని ఆర్థికసాయం అందిస్తారు. నిబంధనల కొర్రీ ఆర్థికసాయం కోరాలని ఉన్నా చాలా మంది నిరుపేద యువతులు ప్రభుత్వ నిబంధనలు చూసి వెనకడుగు వేస్తున్నారు. సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం, వివాహాలకు జిల్లా అధికారులు రావడ ం.. జంటలతో ఫొటోలు దిగుతుండడంతో ఇష్టం లేని కొందరు పెళ్లి కొడుకులు సామూహిక వివాహాలైతే సంబంధం రద్దు చేసుకోవాలని యువతి కుటుంబీకులతో తెగేసి చెబుతున్నారు. మరోపక్క.. పెళ్లి తేది నిశ్చయమైన తర్వాత యువతీ కుటుంబీకులు ఆర్థికసాయం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ రోజు కనీసం మూడు జంటలు పెళ్లికి సిద్ధంగా ఉంటేనే ఆర్థికసాయం అందిస్తామని లేకపోతే పెళ్లి తేది మార్చుకోవాలని అధికారులు చెప్తున్నారు. దీంతో యువతీ కుటుంబీకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇదిలావుంటే.. మహారాష్ట్రలో దరఖాస్తు చేసుకున్న ముస్లిం యువతులకు అక్కడి ప్రభుత్వం రూ.25 వేలు చెక్కు రూపంలో అందిస్తోంది. పెళ్లి అయిన తర్వాత పెళ్లి పత్రాల జిరాక్స్ కాపీ సంబంధిత కార్యాలయానికి పంపిస్తే సరిపోతుందని ఆదేశించింది. అయితే విధానాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేస్తే బాగుంటుందని.. ఎన్నో జంటలు ముందుకు వచ్చి పెళ్లిళ్లు చేసుకునే వీలుంటుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కాగా, ప్రభుత్వం తన వంతు ఆర్థికసాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. కానీ లబ్ధిపొందాల్సిన వారు జిల్లాలో చాలా మంది ఉన్నారు. ప్రభుత్వంతోపాటు ప్రవాసాంధ్రులూ నిరుపేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు..’ అని ముస్లిం వెల్ఫేర్ డెవలప్మెంట్ కమిటీ కోశాధికారి ముహమ్మద్ అబ్దుల్ ఖాలీఖ్ చెప్పారు. పథకం లక్ష్యం : ముస్లిం యువతులకు ఆర్థికసాయం అమలు చేసే శాఖ : మైనార్టీ సంక్షేమం 2011-12లో పెళ్లిళ్లు: 10 2012-13లో.. : 04 ఈ ఏడాది : ఒక్క దర ఖాస్తు కూడా రాలేదు మూలుగుతున్న నిధులు : రూ.12.50 లక్షలు -
మైనారిటీ వర్గాల విద్యాప్రదాత రసూల్ ఖాన్ కన్నుమూత
హైదరాబాద్, సాక్షి: మైనారిటీ వర్గాల ప్రజల విద్యాభివృద్ధి కోసం ఆహర్నిశలూ కృషి చేసిన విద్యా ప్రదాత డాక్టర్ మహమ్మద్ విజారత్ రసూల్ ఖాన్ (66) సోవువారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న రసూల్ ఖాన్ సోమవారం మధ్యాహ్నం 12గంటలకు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు నలుగురు కుమారులు ఉన్నారు. 1947 డిసెంబర్ 22న హైదరాబాద్‌లో జన్మించిన రసూల్ ఖాన్ బాల్యం. హైదరాబాద్‌లోనే గడిచింది. గన్‌ఫౌండ్రిలోని ఆలియా స్కూల్లో ప్రాథమిక, ఉన్నత విద్యనభ్యసించి, 1970 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్‌గా పట్టభద్రులయ్యారు. సికింద్రబాద్‌లోని అసుపత్రిలో వైద్య వృత్తిని సాగించారు. 1984ఉప ఎన్నికల్లో ఒకసారి,1985లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆసిఫ్‌నగర్ నుంచి రెండుసార్లు శాసనసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఆయన 1998 లో షాదాన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. దేశంలో కేజీ నుంచి పీజీ స్థాయివరకూ విద్యా సంస్థలను స్థాపించిన ఘనత విజారత్ రసూల్ ఖాన్‌కే దక్కింది. దేశంలోనే మొదటి మహిళా మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించారు. ఆయన 18 ఇంజనీరింగ్ కళాశాలలు, రెండు మెడికల్ కళాశాలలు, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు స్థాపించారు. మంగళవారం మధ్యాహ్నం ఖైరతాబాద్‌లోని షాదాన్ మసీదులో మధ్యాహ్నం ఒకటిన్నరకు జనాజా నమాజు అనంతరం ఆయున అంత్యక్రియలు జరుగుతాయి. హిమాయత్ సాగర్ రోడ్డులోని షాదాన్ హస్పిటల్ ఆవరణలో రసూల్ ఖాన్ భౌతిక కాయాన్ని ఖననం చేస్తారు. రసూల్ ఖాన్ మృతిపట్ల పలువురు రాజకీయు నాయుకులు అక్బరుద్దీన్ ఒవైసీ, మోజమ్ ఖాన్, అఫ్సర్ ఖాన్, షబ్బీర్ అలీ, అహ్మద్ బలాలా, జాహెద్ అలీ ఖాన్, పలు విద్యా సంస్థలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు, ఉలేమాలు, ముప్తీలు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రార్థనలు నిర్వహించారు.