
ప్రైవేటు బస్సులను నిషేధించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సులను ప్రభుత్వం నిషేధించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే ప్రజలే తిరగబడి ప్రైవేటు బస్సులను భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. ప్రైవేటు ఆపరేటర్లే ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, రవాణా శాఖ అధికారులపై దౌర్జన్యం చేసే పరిస్థితి నెలకొందని.. వారి ఆగడాలను అరికట్టేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని పలు రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి. ‘రహదారి ప్రమాదాలు-ప్రైవేటు బస్సుల ఆగడాలపై’ ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో అఖిలపక్ష సమావేశం నారాయణ అధ్యక్షతన జరిగింది. దీనికి వై.వెంకటేశ్వరరావు (సీపీఎం), ప్రేంసింగ్ రాథోడ్(బీజేపీ), రాంబాబు(టీడీపీ), నరేందర్‌రెడ్డి, దయానంద్ (ఫార్వర్డ్‌బ్లాక్), గోవింద్(ఆర్‌ఎస్‌పీ), కె.రామకృష్ణ, జి.ఓబులేసు, అజీజ్‌పాషా, ఆర్.వెంకయ్య(సీపీఐ) సహా పలు కార్మిక, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు.
నారాయణ మాట్లాడుతూ.. వేగంతోపాటు భద్రత, నిఘా వ్యవస్థలను పటిష్టం చేయాలన్నారు. ప్రైవేటు బస్సులవల్ల ఆర్టీసీకి ఏటా రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రైవేటు క్యారేజీలన్నింటినీ నిషేధించాలన్నారు. ప్రమాదాలన్నింటికీ కారణం మానవ తప్పిదాలేననడం సరికాదని సీపీఎం నేత వై.వెంకటేశ్వరరావు అన్నారు. రవాణా వ్యవస్థే ప్రైవేటు మాఫియా చేతుల్లో ఉందన్నారు. ప్రమాదాల నివారణకు స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ ఉండాలన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. బస్సు ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్లపైగాక యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని, ప్రైవేటు ఆపరేటర్ల ఆగడాల నియంత్రణకు స్వతంత్ర నిఘావ్యవస్థ ఉండాలని, దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో శిక్షణ, అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించాలని, రవాణాను వ్యాపారంగాకాక సామాజిక సేవాదృక్పధంతో చూడాలనే తీర్మానాలు ఇందులో ఉన్నాయి. అంతకుముందు సమావేశం ప్రారంభంలో మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు ప్రమాద మృతులకు నేతలు సంతాపం తెలిపారు. బస్సు ప్రమాదంలో తమవారిని కోల్పోయిన ఆశిష్, మొయినుద్దీన్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాలను నిషేధించాలని, నూటికి 90 శాతం ప్రమాదాలు మద్యం వల్లే జరుగుతున్నాయని వీరు పేర్కొన్నారు.
అక్రమ వాహనాలను నియంత్రించాలి: ఎన్‌ఎంయూ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు బస్సులపై రోజుకు 50 చొప్పున చేస్తున్న దాడులు.. కంటితుడుపు చర్యగాగాక నిరంతరం కొనసాగించాలని ఆర్టీసీ ఎన్‌ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీఏ అధికారులు కేవలం బస్సులపై దాడులు చేస్తేనే సరిపోదని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న అన్నిరకాల వాహనాలనూ నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు.