సాక్షి, కాకినాడ: సంక్రాంతి పగటి వేషగాళ్లలా బినామీలతో రాజధానిలో కృత్రిమ ఉద్యమాలు సృష్టించొద్దని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో మూడు రాజధానులకు మద్దతుగా వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దాడిశెట్టి మాట్లాడుతూ.. రాజధానిపై రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్ళి మాట్లాడే దమ్ము చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు ఉందా అని ప్రశ్నించారు. అమరావతిపై చంద్రబాబు తాపత్రయం అంతా తన బినామీల ఆస్తులను కాపాడుకోవడం కోసమేనని ప్రజలకు అర్థమైందన్నారు. రాజధానిపై ఎందుకు రిఫరెండం పెట్టాలని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, విప్‌ల మీద చంద్రబాబు గూండాలు దాడి చేసినా.. కుల, మత ఘర్షణలు తెచ్చినా మాట్లాడకుండా మౌనంగా ఉండాలా అని ధ్వజమెత్తారు. టీడీపీ దుర్మార్గాలను అరికడుతున్నారు కాబట్టే.. పోలీసులపై చంద్రబాబు నెపం నెట్టుతున్నారని నిప్పులు చెరిగారు.
రాష్ట్ర ప్రజలకు కామెడీ చూపిస్తున్నారు...
ఎన్నికలకు ముందు కేఏ పాల్ కామెడీ చేసేవారని.. ఇప్పుడు ‘పవన్ నాయుడు పాల్’ రాష్ట్ర ప్రజలకు కామెడీ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ మాటల్లో చిత్తశుద్ధి లేదన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా..పవన్ ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలన్నారు. ఇవాళ చంద్రబాబుకు ఇబ్బంది వస్తే పవన్ కల్యాణ్ వెంటనే వచ్చి వాలిపోతున్నారన్నారు. ‘గత నాలుగు వారాలుగా రెండు పత్రికలు, ఐదు టీవీ ఛానెళ్లు రాష్ట్ర ప్రజలకు నిజం చెప్పడం మానేశాయి. ఆ పత్రికలకు హెడ్ ఆఫీస్ హైదరాబాద్‌లో.. బ్రాంచ్ ఆఫీసులు జిల్లా వారీగా ఉండొచ్చు.. ఆ పత్రికలు, టీవీ ఛానెళ్ల యాజమానులకు కూడా అమరావతిలో బినామీ ఆస్తులు ఉన్నాయోమోనని అనుమానంగా ఉంది. వాటిపై కూడా దర్యాప్తు చేయాలని’ ముఖ్యమంత్రిని దాడిశెట్టి రాజా కోరారు. మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
(చదవండి: మూడు రాజధానులు కావాల్సిందే..)
Comments
Please login to add a commentAdd a comment