
సాక్షి, కాకినాడ: లోకేష్.. చంద్రబాబు కుమారుడు కాకపోతే శాసనమండలిలో అంటెండర్ ఉద్యోగానికి కూడా పనికిరాడని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. శుక్రవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. మండలి జరుగుతున్నప్పుడు లోకేష్ ఒక పప్పులా వ్యవహరించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక యువ నాయకుడు ఎలా వ్యవహరించాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి నేర్చుకోవాలని లోకేష్‌కు దాడిశెట్టి రాజా హితవు పలికారు.
యనమల టెర్రరిజం గురించి ప్రజలకు తెలుసు..
యనమల రామకృష్ణుడు టెర్రరిస్టు కన్నా దారుణంగా వ్యవహరించారని.. యనమల టెర్రరిజం గురించి తుని నియోజకవర్గంలో ప్రతిఒక్కరికి తెలుసునన్నారు. కాపు ఉద్యమ సమయంలో అప్పటి జిల్లా ఎస్పీ, ఎఎస్పీని వెంటేసుకుని జిల్లాను ఏవిధంగా భయబ్రాంతులకు గురిచేశారో జిల్లా అంతా తెలుసునన్నారు. గత ఎన్నికల్లో యనమల, ఆయన సోదరుడిని జిల్లా ప్రజలు తరిమికొట్టిన విషయాన్ని వారు గుర్తించుకోవాలన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దేశ ద్రోహి యనమల అని తీవ్రంగా దుయ్యబట్టారు.
ప్రలోభాల గేట్లు తెరిస్తే..
రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలు పన్నులు కడుతున్నారు తప్ప.. చంద్రబాబు బినామీలు కోసం కాదన్నారు. చంద్రబాబు బినామీల కోసం.. తమ కష్టాలను త్యాగం చేసే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. అమరావతిని రాజధానిగా అంగీకరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని స్పష్టం చేశారు. తాము ప్రలోభాల గేట్లు తెరిస్తే..నీ పక్కన కొడుకు, బావమరిది తప్ప మరెవ్వరు ఉండరన్న సంగతి చంద్రబాబు గుర్తించుకోవాలని దాడిశెట్టి రాజా నిప్పులు చెరిగారు.