ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: మహిళా శిశు సంక్షేమ శాఖలో ఇటీవల నిర్వహించిన గ్రేడ్-2 రెగ్యులర్ సూపర్‌వైజర్ పోస్టుల వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందినవారు వివిధ కోర్టులను ఆశ్రయించారు. లోకాయుక్త నుంచి సుప్రీంకోర్టు వరకు సూపర్‌వైజర్ పోస్టుల కేసులు నడుస్తున్నాయి. ఇటీవల హైకోర్టు, సుప్రీంకోర్టు బెంచ్‌లకు వెళ్లిన ఈ కేసులు వాయిదా పడిన విషయం విదితమే. తాజాగా మరోమారు విచారణకు తేదీలను కోర్టులు ఖరారు చేశాయి. ఈనెల 4న ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, 6న హైకోర్టు, 9న సుప్రీంకోర్టు, 12న లోకాయుక్త కోర్టుల్లో సూపర్‌వైజర్ల నియామకాల విచారణలు జరగనున్నాయి. సాధారణ న్యాయస్థానాల నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు కేసులు నడుస్తుండటంతో ఏ కోర్టు ఎలాంటి ఉత్తర్వులు వెలువరిస్తుందోనని సూపర్‌వైజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
సుదీర్ఘ కాలం తరువాత మహిళా శిశు సంక్షేమశాఖలో గ్రేడ్-2 రెగ్యులర్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో ఖాళీగా 305పోస్టులను 3887మంది అభ్యర్థులు రాత పరీక్ష రాశారు. అందులో 248 మందిని రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయడంతోపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వడమే తరువాయిగా ఉన్న సమయంలో సూపర్‌వైజర్ పోస్టుల నియామకాలు అడ్డగోలుగా జరిగాయంటూ కొంతమంది అంగన్‌వాడీ కార్యకర్తలు కోర్టులను ఆశ్రయించారు. గుంటూరు జిల్లాకు చెందిన సునీత అనే కార్యకర్త ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, రమాదేవి అనే అంగన్‌వాడీ కార్యకర్త హైకోర్టును ఆశ్రయించారు. నెల్లూరు జిల్లాకు చెందిన సునీత అనే అంగన్‌వాడీ కార్యకర్త సుప్రీంకోర్టును, సమాచార హక్కు చట్టం రాష్ట్ర అధ్యక్షుడు టీ గంగాధర్ లోకాయుక్తను ఆశ్రయించారు.
నోటిఫికేషన్ నుంచే పోస్టుల ప్రక్రియ వివాదాస్పదమైంది. కాంట్రాక్టు సూపర్‌వైజర్లుగా విధులు నిర్వర్తిస్తున్నవారు ఏటా ఏప్రిల్‌లో తమ సర్వీసును రెన్యువల్ చేయించుకోవలసి ఉంటుంది. అయితే ఈ ఏడాది వారి సర్వీసు రెన్యువల్ కాలేదు. నోటిఫికేషన్ వెలువడిన అనంతరం అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న తరువాత కంటిన్యూషన్ ఆర్డర్ ఇచ్చారు. వాస్తవానికి నోటిఫికేషన్ వెలువడేనాటికి వారు గాలిలో ఉన్నారంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా శిక్షణా కేంద్రాలకు చెందిన ఇన్‌స్ట్రక్టర్లకు రిజర్వేషన్ కేటాయించడాన్ని తప్పుపడుతూ మరికొంతమంది కోర్టును ఆశ్రయించారు.
ఆందోళనలో అంగన్‌వాడీలు
తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టులను ఆశ్రయించిన అంగన్‌వాడీ కార్యకర్తల పరిస్థితి ‘అడకత్తెరలో పోకముక్క’లా మారింది. తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టులను ఆశ్రయించడాన్ని సమర్ధించుకుంటున్నప్పటికీ ఆ తరువాత జరిగే పరిణామాలను తలచుకొని ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం జరగకపోయినా ఆ తరువాత విధులు నిర్వర్తించే సమయంలో అధికారుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయోనని కొంతమంది కలవరపడుతున్నారు. ఇప్పటికే ఆ శాఖకు చెందిన అధికారి ఒకరు కోర్టులకు వెళ్లిన వారి వివరాలను ప్రాజెక్టుల వారీగా సేకరిస్తున్నట్లు తెలిసింది. కోర్టు కేసులు ముగిసిన తరువాత విధి నిర్వహణకు సంబంధించి వారిపై తమ ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధం అవుతున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది.
కోర్టుల్లో సూపర్‌వైజర్ పోస్టుల వివాదం
Published Wed, Dec 4 2013 6:58 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement