సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల వర్గీకరణ కార్యక్రమం వివాదాస్పదమవుతోంది. విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించి ఉపాధ్యాయులను ఏ,బీ,సీ,డీ గ్రేడ్‌లుగా వర్గీకరించాలని గత నెల 31న సొసైటీ కార్యదర్శి కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ అయింది. ఈ సర్క్యులర్ ప్రకారం ప్యానెల్ ఇన్‌స్పెక్టర్లు సొసైటీ పరిధిలోని విద్యాసంస్థలకు వెళ్లి అక్కడి సౌకర్యాలను పరిశీలించి ఆ పాఠశాలల పరిస్థితిని బట్టి గొప్పగా ఉంది (ఎ), చాలా బాగుంది (బి), సంతృప్తస్థాయిలో ఉంది (సి), బాగాలేదు (డి) అని వర్గీకరించాల్సి ఉంటుంది. దీంతో పాటు పాఠశాలల్లోని ఉపాధ్యాయుల పనితీరును బట్టి వారిని కూడా అదే రీతిలో వర్గీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులను కూడా గ్రేడింగ్ చేయాలని ఉత్తర్వులివ్వడంపట్ల సొసైటీ పరిధిలోని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఒక ఉపాధ్యాయుని పనితీరును అంచనా వేయాల్సింది వార్షిక పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి తప్ప... ఒక్క పీరియడ్‌లో అంటే కేవలం 45 నిమిషాల కాలవ్యవధిలో ఒక నిర్ధారణకు రావడం అశాస్త్రీయమని ఉపాధ్యాయ సంఘాల నేతలంటున్నారు.
అసలు దేశంలో ఎక్కడైనా ఉపాధ్యాయులను ప్యానెల్ ఇన్‌స్పెక్టర్లు వర్గీకరించడం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్‌ఈ విద్యాసంస్థల్లోని టీచర్లను వర్గీకరించాలనే ప్రయత్నం చేసిందని, అయితే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఈ విషయమై ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నర్సింహారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థుల ప్రతిభాపాటవాలను మెరుగుపరిచేందుకు ఇది సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. డిగ్రీలు, పీజీలు, వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేసి ఉపాధ్యాయులుగా నియమితులైన వారి పనితీరు సంతృప్తికరంగా లేకపోతే మరిన్ని శిక్షణా తరగతులు నిర్వహించి సిలబస్‌పై అవగాహన కల్పించాలే తప్ప ఇలా అవమానించే విధానాలను అమల్లోకి తేవడం విద్యావ్యవస్థకు మంచిది కాదని చెప్పారు. సొసైటీ తీసుకున్న నిర్ణయం కారణంగా ఉపాధ్యాయుల్లో విభేదాలు రావడంతో పాటు ఒకరంటే ఒకరికి చులకన భావం ఏర్పడే పరిస్థితులు వస్తాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, సిబ్బంది సంఘం ప్రధాన కార్యదర్శి సి.హెచ్.బాలరాజు అభిప్రాయపడ్డారు. వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గురుకులాల్లో ‘గ్రేడింగ్’
Published Tue, Sep 17 2013 2:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM