ధాన్యం తీసుకెళ్లండి
కొనుగోలు కేంద్రాల దుస్థితి ఇది
ఇంకా తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు
దళారుల ఇష్టారాజ్యం.. రోజురోజుకు తగ్గిపోతున్న ధర
నిల్వచేసుకునే వీలు లేక తెగనమ్మేస్తున్న అన్నదాత
సర్కారు నిబంధనలతో దక్కని మద్దతు ధర
గూడూరుకు చెందిన రంగయ్యనాయుడుకు రెండెకరాల పొలం ఉంది. ఎకరాకు 4 పుట్లు చొప్పున 8 పుట్ల ధాన్యం పండింది. నూర్పిళ్లు చేశాక ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ కేంద్రానికి తాళం వేసి ఉంది. అక్కడి నుంచి అధికారికి ఫోన్‌చేయగా ‘మేం కొనలేం.. తీసుకొచ్చిన ధాన్యాన్ని వెనక్కు తీసుకెళ్లండి’ అంటూ కట్‌చేశారు. ధాన్యాన్ని ఇంట్లో ఉంచుకునే చోటులేక.. మధ్యలోనే వ్యాపారస్తుడికి ఫోన్‌చేశారు. ఆ వ్యాపారి బస్తా రూ.వెయ్యికి అడిగారు. రంగయ్య బతిమలాడితే మరో రూ.50 పెంచాడు. బస్తా రూ.1050కి తెగనమ్మేసి ఇంటికి చేరుకున్నాడు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఎన్నడూలేని విధంగా రబీలో అధికారికంగా 5.4 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. పంటంతా దాదాపు కోతకు వచ్చింది. కొందరు నూర్పిళ్లు చేసి నివాసాల్లో దాచి ఉంచితే.. మరికొందరు పొలాల్లోనే నిల్వచేసుకుని మద్దతు ధర కోసం వేచిచూస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సి ఉంది. అందుకోసం 164 కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటి ద్వారా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో నిల్వ చేయాలనుకున్నారు.
ఆదిలో హంసపాదు
జిల్లాలో ఈ ఏడు వరిని విస్తారంగా సాగుచేశారు. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో చేతికొచ్చింది. దీంతో రైతుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. అయితే గిట్టుబాటుధర వారిని భయపెడుతోంది. ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కేవలం 16 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసింది. అందులో ఇంతవరకు ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదు. రైతులు ధాన్యాన్ని కేంద్రాల వద్దకు తీసుకెళితే చేదు అనుభవం ఎదురవుతోంది.
రైతులకు అన్యాయం
ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వచేస్తుంది. అయితే ఈసారి ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. అందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలే కారణం. గతేడాది ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద నిల్వచేశారు. ప్రభుత్వం అప్పగించిన ధాన్యానికి 60 శాతం బియ్యం ఇచ్చేవారు. అయితే ఈసారి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులో నిల్వచేయాలంటే ఆ వ్యాపారి బ్యాంకు గ్యారెంటీ చూపించాలని నిబంధన పెట్టింది. రూ.కోటి విలువచేసే ధాన్యం నిల్వచేసుకోవాలంటే అంతే మొత్తానికి ష్యూరిటీ ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. అయితే మిల్లర్లు మాత్రం ‘మాకు అంత అవసరం ఏముంది. 25 శాతం మాత్రం గ్యారెంటీ ఇస్తాం. నిల్వచేసేపనైతే చేయండి.. లేదంటే మీ ఇష్టమొచ్చినచోట్ల ఉంచుకోండి’ అని తెగేసి చెబుతున్నారు.
అన్నదాతకు దక్కని మద్దతు ధర
ధాన్యాన్ని నిల్వచేసుకునేందుకు ఐదారుగురు మిల్లర్లు తప్ప మిగిలిన వారు ముందుకు రావటం లేదు. దీంతో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభింలేదు. అదేవిధంగా కొత్తవాటిని ఏర్పాటు చేయలేని దుస్థితి. ప్రభుత్వ చర్యలతో దళారులు, వ్యాపారుల పంట పండుతోంది. మొదటి రకం ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర రూ.1,450 ఉంటే.. వ్యాపారులు బస్తా రూ.1,200 నుంచి రూ.1,100కి కొనుగోలు చేసుకుంటున్నారు. అదేవిధంగా సాధారణ రకం రూ.1,410 ఉంటే.. వ్యాపారులు మాత్రం రూ.1,050 నుంచి రూ.1,070 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల పుణ్యమా అంటూ రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర దక్కకటం లేదు. చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు మాత్రం చెల్లించి మిగిలిన మొత్తాన్ని వచ్చే ఏడాది తీరుస్తానని వ్యాపారులను వేడుకుంటున్నారు.
అప్పులబాధతో తక్కువ ధరలకే విక్రయించాం:
వ్యవసాయ పెట్టుబడుల కోసం అప్పులు చేశాం. పంట వచ్చింది. అప్పులవాళ్లు అడుగుతున్నారు. ఇటుచూస్తేమో మేం అనుకున్న ధరకు ధాన్యం అమ్ముడుపోయేలా కనిపించడం లేదు. అటు చూస్తేనేమో అప్పులబాధ తట్టుకోలేకపోతున్నాం. వడ్డీ భారం పెరుగుతుండటంతో తక్కువ ధరలకే ధాన్యం అమ్మేశాం.
-మోపూరు చెంచురామయ్య, రైతు
అధికారులు పట్టించుకోలేదు:
వరికోతలు చివరి దశలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అయితే వాటి ద్వారా ఇంకా కొనుగోలు చేయటం లేదు. అప్పులబాధ భరించలేక వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. అయితే దళారులు మమ్మల్ని నిలువునా మోసం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు.
-మధుసూధన్‌రాజు,రైతు.