సైన్యం కదిలింది | Grama Valunteer Service in YSR kadapa | Sakshi
Sakshi News home page

సైన్యం కదిలింది

Published Thu, Mar 26 2020 10:11 AM | Last Updated on Thu, Mar 26 2020 10:11 AM

Grama Valunteer Service in YSR kadapa - Sakshi

బద్వేలు మున్సిపాలిటీలో వివరాలు సేకరిస్తున్న వలంటీర్లు (ఫైల్‌)

సాక్షి కడప : కరోనాపై సమరం సాగుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడికక్కడ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ప్రధాని నరేంద్రీమోదీ స్వీయ నిర్బంధానికి పిలుపునివ్వడంతో అంతటా నిర్బంధం సాగుతోంది. జిల్లాకు సంబంధించి ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని పూర్తి స్థాయిలో కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు అధికారులు కంకణం కట్టుకుని కదులుతున్నారు. ఇప్పటికే మొదటివిడతలో ఈనెల రెండోవారంలో ఒకమారు పూర్తి చేసి వివరాలు సేకరించిన వలంటీర్లు అనే సైనికులు మరోమారు కరోనా మహమ్మారిపై పూర్తి స్థాయిలో వివరాలకు ఇళ్ల బాట పడుతున్నారు. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు, స్థానికంగా ఇళ్లలో ఉన్న వారికి సంబంధించి జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరణ
ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో తిరిగి జిల్లాకు వచ్చిన వారి వివరాలను వలంటీర్లు సేకరిస్తున్నారు. విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారు? ప్రస్తుతం ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? తదితర వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు. జిల్లాకు విదేశాల నుంచి దాదాపుగా 3,936 మందికి పైగా ఇటీవల వచ్చిన నేపథ్యంలో వారందరికీ సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా విదేశాల నుంచి వచ్చిన అందరినీ ఐసోలేషన్‌ కేంద్రాల్లో పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎక్కడైనా, ఎవరైనా వచ్చి తప్పించుకుని తిరుగుతున్న నేపధ్యంలో సర్వే ద్వారా వివరాలు సేకరించి కామన్‌ క్వారంటైన్‌కు తరలించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రధానంగా విదేశాలకు సంబంధించినవారి వివరాలను సేకరించి స్క్రీనింగ్‌ చేసిన వివరాలను అప్‌లోడ్‌ చేస్తున్నారు.

జలుబు, జ్వరం, దగ్గు ఉన్నా..
ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ చూసినా...ఏ నోట విన్నా ఒకటే మాట కరోనా వైరస్‌.. నలుగురు కలిసినా దీని గురించి చర్చోప చర్చలు. ప్రస్తుతం ఇంటిలో ఉన్న సాధారణ మనుషులకు కూడా జలుబు, జ్వరం, దగ్గు ఉన్నా కూడా కరోనా వైరస్‌ అని భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. స్వీయ నిర్బంధం, ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించడం ద్వారానే దీనిని నివారించవచ్చు. ఎందుకంటే వైరస్‌కు మందు లేదు. ప్రస్తుతం సర్వేలో భాగంగా వలంటీర్లు జలుబు, జ్వరం, దగ్గు ఉన్న వారి వివరాలను కూడా ప్రభుత్వానికి అప్‌లోడ్‌ చేసి పంపుతున్నారు.

రెండురోజుల్లో సర్వే
జిల్లాలో కరోనా వైరస్‌పై వలంటీర్లు సర్వే కొనసాగిస్తున్నారు. ఏఎన్‌ఎంలు కూడా కొంత సహకారం అందిస్తుండగా..అన్ని వివరాలు రాబడుతున్నారు. బుధ, గురు వారాల్లో సర్వేను పూర్తి చేసి అప్‌లోడ్‌ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో వేగవంతం చేశారు. 

ఇంటింటికి తిరుగుతూ.. వివరాలు రాబడుతూ..
జిల్లాలోని 51 మండలాలు, అన్ని మున్సిపాలిటీలను కలుపుకుని దాదాపుగా 889 సచివాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో 14,892 మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. 50 ఇళ్లకు ఒకరు చొప్పున ఉండడంతో వారు ప్రస్తుతం సర్వేను ఇంటింటికి తిరుగుతూ అన్ని వివరాలు తీసుకుని యంత్రాంగానికి పంపుతున్నారు. జిల్లాలో 7,77,553 ఇళ్లు ఉండగా అన్ని ఇళ్లకు ఉదయం నుంచి వెళుతూ సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు.

వివరాలు సేకరిస్తున్నాం
విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు, మరికొంత సమాచారాన్ని సేకరిస్తున్నాం. రెండు రోజుల్లో పూర్తి చేసేందుకు ఈరోజే మొదలు పెట్టి ఇంటింటికి తిరుగుతున్నాం. విదేశాల నుంచి ఎవరెవరు వచ్చారు? ఏ దేశం నుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ప్రస్తుతం ఎలా ఉన్నారు? అనారోగ్య సమస్య ఉందా? ఐసోలేషన్‌కు వెళ్లారా? లేదా? ఇలా అన్ని వివరాలను నమోదు చేస్తున్నాం.– జి.వినోద్, 47/1, అక్కాయపల్లె, వలంటీర్, కడప

సర్వే పూర్తి కావచ్చింది
మా పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నాం. ప్రస్తుతం దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి సంబంధించి వివరాలు తీసుకొచ్చి అప్‌లోడ్‌ చేస్తున్నాం. నబీకోట పరిధిలో దాదాపుగా సర్వే పూర్తి కావచ్చింది.  – పఠాన్‌ బషీర్, నబీకోట, వలంటీర్, కడప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement