
ఘనంగా ఎమ్మెల్యే గొట్టిపాటి జన్మదిన వేడుకలు
అద్దంకి : అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తన జన్మదిన వేడుకలను కర్నూలు జిల్లా శ్రీశైలంలో నాయకులు, అభిమానుల మధ్య ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. రెండురోజుల క్రితం శ్రీశైలానికి పాదయాత్ర ప్రారంభించిన ఆయన.. ఆదివారం మల్లన్న సన్నిధికి చేరుకున్నారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా శ్రీశైలంలోని అతిథి గృహంలో బసచేస్తున్న ఆయనను పలువురు వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.వారందరి మధ్య బర్త్‌డే కేక్‌ను ఎమ్మెల్యే కట్‌చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలానికి పాదయాత్ర నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
అద్దంకి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవచేస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాదయాత్ర, జన్మదిన వేడుకల్లో వైఎస్‌ఆర్ సీపీ అద్దంకి పట్టణ కన్వీనర్ కాకాని రాధాకృష్ణమూర్తి, బల్లికురవ మండల కన్వీనర్ మలినేని గోవిందరావు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కోయి అంకారావు, నాగులపాడు సొసైటీ అధ్యక్షుడు సందిరెడ్డి రమేష్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సందిరెడ్డి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు కొప్పోలు హనుమంతరావు, హుస్సేన్‌బాషా, మహబూబ్‌సుభానీ, ఏజండ్ల ఆంజనేయులు, సుబ్బయ్య, అద్దంకి నియోజకవర్గానికి చెందిన 300 మంది అభిమానులు పాల్గొన్నారు.