కల్చరల్(కాకినాడ) : మాజీ రాష్ట్రపతి దివంగత సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లాలో గురుపూజోత్స వాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ అంబేద్కర్ భవన్‌లో 224 మందికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నీతూ ప్రసాద్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, డీఈఓ కేవీ శ్రీనివాసులురెడ్డి తదితరులు సర్వేపల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 126వ జయంతిని విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి అధ్యక్షత వహించారు.
పుట్టగొడుగుల్లా ప్రైవేట్ స్కూళ్లు
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలల్లో సరైన ఉపాధ్యాయులు లేరని వ్యాఖ్యానించారు. రాజీవ్ విద్యామిషన్, రాజీవ్ మాధ్యమిక విద్యా అభియాన్ వంటి పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినట్టు వివరించారు. వాటికనుగుణంగా విద్యా ప్రమాణాలు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణతలో ఈ ఏడాది రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానం రావడంపై ఆమె సంతోషం వెలిబుచ్చారు. ఉపాధ్యాయుల కృషితోనే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే ప్రాపంచిక విజ్ఞానాన్ని అందించాలని సూచించారు. విలువలతో కూడిన విద్యను అందించినపుడే విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని, తద్వారా దేశ మానవ వనరులు వృద్ధి చెందుతాయన్నారు.
రానున్న రోజుల్లో కూడా విద్యాపరంగా జిల్లాను అగ్ర స్థానంలో ఉండేటట్టు ఉపాధ్యాయులు కృషి చేయాలని జెడ్పీ చైర్మన్ రాంబాబు అన్నారు. ఏజేసీ డి.మార్కండేయులు మాట్లాడుతూ మెరుగైన సమాజ నిర్మాణం, సమాజంలోని పరిస్థితులను మార్చగలిగే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు. ఆర్‌జేడీ ఎంఆర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ అత్యున్నత స్థాయికి చేరుకున్న సర్వేపల్లి ప్రత్యేక వ్యక్తిత్వానికి, ఆలోచన ధోరణికి ప్రతీకగా నిలిచారన్నారు.
307 మంది ఐఐఐటీకి ఎంపిక
డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 5,600 పాఠశాలల్లో 7.60 లక్షల మంది విద్యార్థులకు సుమారు 20 వేల మంది ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది టెన్త్ ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం నిలిచేందుకు ఉపాధ్యాయుల కృషే కారణమని అభినందించారు. ఈ ఏడాది జిల్లా నుంచి 307 మంది విద్యార్థులు ఐఐఐటీకి ఎంపికయ్యారని తెలిపారు. రానున్న డీఎస్సీలో 2100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశిష్ట అతిథులుగా ఏజేసీ, ఆర్‌జేడీలతో పాటు, డీవైఈఓలు వెంకటనర్సమ్మ, ఆర్‌ఎస్ గంగాభవాని, పీఆర్‌ఓ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 224 మంది ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. తొలుత వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులను ఆకట్టుకున్నారు. సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య రూపకం ఆహూతులను అలరించింది. సంప్రదాయ వేషధారణలో గురువు ఔన్నత్యాన్ని తెలిపే పాటలకు, నృత్యాన్ని జోడించి ప్రదర్శించారు.
వైభవంగా ‘గురు’ సంబరం
Published Sat, Sep 6 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM
Advertisement
Advertisement