అరవై ఏళ్ల కల....
లోక్‌సభ సాక్షిగా సాకారమైన వేళ...
నల్లగొండ నగారై మోగింది...
ఊరూవాడా...ఎక్కడ చూసినా...
జై తెలంగాణ....జైజై తెలంగాణ
త్యాగాల బాటలో..పోరు కె రటాలై..
మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతచారి..
ఉస్మానియాలో ఊపిరొదిలిన వేణుగోపాలరెడ్డి..
మంత్రి పదవినే వదులుకున్న కోమటిరెడ్డి..
నిత్య నిర్బంధాలను (పీడీ యాక్టు)
లెక్కచేయని చెరుకు సుధాకర్..
ఎందరో...ఇంకెందరో పోరుబిడ్డలు...
నా తెలంగాణ...ఇప్పుడు కోటి సంబురాల వీణ
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ‘ప్రాణమివ్వడం.. అంటే .. పొద్దూ పొడవడమాని..’ అన్న కవి వాక్కులను అక్షర సత్యం చేస్తూ అగ్నికీలలతో పునీతుడైన శ్రీకాంతచారి తెలంగాణ తొలిపొద్దు పొడుపు. 2009 డిసెంబరు ప్రకటన అనంతరం వెనక్కితగ్గిన కేంద్రం తీరుకు నిరసనగా నిలువెల్లా కాలిపోయిన కాసోజు శ్రీకాంతచారి పొడిచేడు పేరును తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాడు. వేణుగోపాల్‌రెడ్డి ఆత్మత్యాగం .. తెలంగాణ ప్రజాప్రతినిధులను కదలించిన వైనం.. పదవులు పూచిక పుల్లలతో సమానమంటూ అమాత్య పదవిని అమాంతం వదిలేసుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ప్రభుత్వ నిరంకుశ విధానానికి బాధితునిగా పీడీ యాక్టు కింద జైలుపాలైన డాక్టర్ చెరుకు సుధాకర్.. ఇలా.. తెలంగాణ త్యాగాల చరిత్రలో జిల్లాదే ప్రధానముద్ర. తెలంగాణ చరిత్రలో జిల్లాకు ఓ ప్రత్యేకమైన పేజీ ఉంటుంది
. ఇపుడు తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అన్ని అడ్డంకులూతొలిగిపోయిన వేళ, మంగళవారం జిల్లా అంతటా సంబరాలు అంబరాన్ని అంటాయి.
లోక్‌సభలో బిల్లుప్రవేశ పెట్టినప్పుటి నుంచే అంతా టీవీల ముందు కదలకుండా కూర్చున్నారు. సీమాంధ్ర నేతల గొడవలతో లోక్‌సభ సమావేశాలకు అంతరాయం కలగడం, వరసగా వాయిదా పడుతుండడంతో ఆవేశానికి లోనయ్యారు. తీరా బిల్లు ఆమోదం పొందాక పట్టరాని సంతోషంతో రోడ్లపైకి వచ్చారు. మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు అన్న తారతమ్యం లేదు. అంతా ఒక్క చోట చేరి సంబరాలు చేసుకున్నారు. గడిచిన ఆరునెలలుగా ఎన్నో పరిణామాలను చూస్తున్న తెలంగాణవాదులు ఉత్కంఠగా గడుపుతున్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన జూలై 30వ తేదీ నుంచి ఎంతో సంయమనంతో వేచి చూసిన జిల్లా ప్రజానీకం మంగళవారం కట్టలు తె ంచుకున్న ఆనందంతో ఒక్కసారిగా రోడ్లెక్కారు.
టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత నుంచి ఊపందుకున్న తెలంగాణ ఉద్యమంలో గడచిన పధ్నాలుగున్నరేళ్లలో జిల్లా తెలంగాణవాదులు పోషించిన పాత్ర తక్కువేం కాదు. పలు ప్రధాన ఘట్టాలకు నల్లగొండ వేదికంగా నిలిచింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మూక్కుమ్మడి రాజీనామాలు, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ కార్యక్రమాలు, శ్రీకాంతచారి అమరత్వం, తెలుగు సమాజం ఆలోచించేలా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా, సకల జనుల సమ్మె కాలంలో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన జాతీయరహదారుల దిగ్బంధం ఇలా.. ఎన్నో ప్రధానమైన పోరాటాలకు, త్యాగాలకు జిల్లా చిరునామాగా నిలిచింది. ఈ కారణంగానే బిల్లు ఆమోదం పొందగానే.. అనూహ్యమైన స్పందన ప్రజల్లో కనిపించింది.
నా త్యాగం.. వృథా కాలేదు :
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే
‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అలవోకగా ప్రాణత్యాగం చేసిన యువతీ యువకుల సాహసం కదిలించింది. స్ఫూర్తిగా నిలిచింది. యువత తమ విలువైన ప్రాణాలనే తృణప్రాయం అనుకుంటుంటే.. ఇక నా పదవేం గొప్ప, దానికేం విలువ లేదనుకున్నా. పదవులు పట్టుకు వేలాడడం ఆత్మవంచనే అనిపించింది. అందుకే మంత్రి పదవిని వదులుకున్నా. ఇపుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకరమవుతుంటే .. అమరుల ప్రాణత్యాగానికి గౌరవం లభించిందనిపిస్తోంది. నా పదవీ త్యాగం.. వృథా కాలేదు అని అనిపిస్తోంది..’ అని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
దశాబ్దాల పోరాటం ఫలించింది
చెరుకు సుధాకర్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు
దశాబ్దాల పోరాటం ఫలించింది. 1200మంది అమరవీరుల త్యాగాలతో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించింది. త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. లాఠీ తూటాలను, అక్రమ అరెస్టులను, సీమాంధ్ర ద్రోహుల కుట్రలను ఎండగట్టి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. ఇకపై తెలంగాణను పునర్నిర్మించుకుందాం.
లోకమంతా సంరంభం
Published Wed, Feb 19 2014 4:31 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement