నెల్లూరు (వేదాయపాళెం), న్యూస్‌లైన్ : లోకరక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్‌ను జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు బుధవారం వేడుకగా జరుపుకున్నారు. క్రైస్తవ ప్రార్థన మందిరాలు భక్తులతో కిక్కిరిశాయి.
మంగళవారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనల్లో తరించారు. పశువుల పాకలో ఉన్న బాలఏసును దర్శించుకుని, కొవ్వొత్తులు వెలిగించారు. కేకులు కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. నగరంలోని సంతపేటలోని రోమన్ క్యాథలిక్ మిషన్ చర్చి, ఏబీఎం చర్చి, వీఆర్సీ సెంటర్‌లోని డౌనిహాల్, రైతుబజారు వద్ద ఉన్న బాప్టిస్టు చర్చి, ఫతేఖాన్‌పేటలో ఉన్న లూథరన్ చర్చి, దర్గామిట్టలోని సాల్వేషన్ ఆర్మీ చర్చి తదితర ప్రాంతాల్లోని చర్చిల వద్ద క్రిస్మస్ సంబరం నెలకొంది.