సంతాప సభలో నివాళులర్పిస్తున్న నాయకులు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : భారత్ మాజీ ప్రధాని అటల్ బీహరీ వాజ్‌పేయి ప్రపంచ రాజకీయాలకే ఓ మచ్చుతునకని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కొనియాడారు. నగరంలోని డే అండ్ నైట్ కూడలిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాల్ అధ్యక్షతన వాజ్‌పేయి సంతాప సభ ఆదివారం ఏర్పాటు చేశారు. ముందుగా ఏబీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొద్ది నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన ఆత్మకు చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించి, జిల్లా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. నీతి నిజాయితీతో, నిస్వార్ధ పరుడుగా ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా వేసుకున్న మహోన్నత వ్యక్తని కొనియాడారు.
బీజేపీ కోర్ కమిటీ రాష్ట్ర సభ్యులు కణితి విశ్వనాథం మాట్లాడుతూ వాజ్‌పేయి 1999లో ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పార్లమెంట్‌లో పాల్గొనే అదృష్టం దక్కిందని అంతే కాకుండా అదే సమయంలో ఉత్తమ పార్లమెంటెరియన్‌గా కితాబిచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రతి మాటలోను కవి భావాలను ఒలికించి ప్రజల మనసులను దొచేయగలిగే సమర్ధుడన్నారు.
ఆశయ సాధనే నివాళి
పైడి వేణుగోపాల్ మాట్లాడుతూ 1983లో కోటబొమ్మాళి వచ్చిన వాజ్‌పేయి ప్రసంగానికి అందరూ ముగ్ధులయ్యారన్నారు. ఆయన ఆశయ సాధనకోసం నిరంతరం కృషి చేయడమే నిజమైన నివాళి అని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన నాన్నతో వాజ్‌పేయికి ప్రత్యక్ష అనుబంధం ఉందని బీజేపీ కిసాన్ మోర్చా నాయుకుడు పూడి తిరుపతిరావు గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో ఓబీసీ మోర్చా దుప్పల రవీంద్రబాబు, నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్రావు, అట్టాడ రవిబాబ్జి, శవ్వాన ఉమామహేశ్వరి, వెంకటేశ్వరరావు, గొద్దు భాగ్యలక్ష్మి, లోక్‌సత్తా అధ్యక్షుడు కొత్తకోట పోలీనాయుడు, అర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘచాలక్ మజ్జి నర్శింహులు, టీడీపీ నాయుకులు చౌదరి బాబ్జి, డోల జగన్, సీపీఐ బుడితి అప్పలనాయుడు, పరివర్తన్ ట్రస్ట్ అధ్యక్షుడు చింతాడ రవికుమార్, సంపతిరావు నాగేశ్వర్రావు, పండి యోగేశ్వర్రావు, దువ్వాడ ఉమామహేశ్వర్రావు, ఎస్వీ రమణమూర్తి, పాతిన గడ్డెయ్య, సువ్వారి సన్యాసిరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment