వాజ్‌పేయితో కరచాలనం చేస్తున్న వీరెళ్లి, కృష్ణారెడ్డి (ఫైల్)
యాదగిరిగుట్ట(ఆలేరు)/నల్లగొండ టూటౌన్,/ సూర్యాపేట అర్బన్ : భారత మాజీ ప్రధాని, అటల్ బిహారి వాజ్‌పేయికి ఉమ్మడి నల్లగొండ జిల్లాతో అనుబంధముంది. నల్లగొండ పట్టణంలో బీజేపీ జిల్లా నాయకత్వం నిర్వహించిన రెం డు బహిరంగ సభల్లో పాల్గొన్నాడు. ఓరుగంటి రాములు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మొట్టమొదట 1982లో నల్లగొండలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొని తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
అదేవిధంగా గుండగోని మైసయ్యగౌడ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్న సమయంలో రెండోసారి నల్లగొండలో 1994లో స్థానిక ఎన్జీ కాలేజీలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని మాట్లాడారు. జాతీ య స్థాయి నేత అప్పట్లో రెండు సార్లు జిల్లాకు రావడం ఎంతో విశేషం. వాజ్‌పేయి షష్టి పూర్తి నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అప్పటి బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో చేశారు. ఆ ఏడాది కొత్త రూపాయ బిళ్ల రిలీజ్ చేశారు.
బీజేపీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో నల్ల గొండలో నిర్వహించిన పార్టీ సభకు హాజరయ్యారు.1980–81, 1991లో జిల్లాలో పర్యటించి నట్టు పార్టీ నాయకులు తెలుపుతున్నారు.
‘పేట’తో అనుబంధం
వాజ్‌పేయికి సూర్యాపేటతో కూడా సంబంధం ఉంది. మూడు సార్లు సూర్యాపేటకు వచ్చారు. 1966లో జన సంఘ్ సమయంలో ఆంధ్రా ప్రాంతం నుంచి వస్తూ స్థానిక గాంధీ పార్కులో స్థానికులతో సమావేశమయ్యారు.
1983 పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అందులో పాల్గొని రూ. 25 వేల నిధులను సమీకరించి బీజేపీ జిల్లా శాఖకు అందించారు. పోటు పుల్లయ్య ఇంట్లో రాత్రి బసచేశారు. 1994లో వాజ్‌పేయి ప్ర«తిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో సూర్యాపేటకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment