
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్(స్క్రీనింగ్ టెస్టు) తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. ప్రిలిమ్స్ పేపర్–1, పేపర్–2 ఫైనల్ కీని కూడా ప్రకటించింది. మొత్తం 167 పోస్టుల భర్తీకి మే 26న ప్రిలిమ్స్ నిర్వహించగా.. అందులో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది(1:50) చొప్పున 8,350 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. గతంలో జీవో 5 ప్రకారం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఏపీపీఎస్సీ కటాఫ్ మార్కులను నిర్దేశించుకుని 1:12 చొప్పున ఎంపిక చేసే విధానాన్ని అనుసరించింది. దీనిపై అభ్యర్థులు అభ్యంతరం చెబుతూ 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయాలని విన్నవించినా గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రస్తుత సర్కారు అభ్యర్థుల విన్నపం పట్ల సానుకూలంగా స్పందించింది. 1:50 చొప్పునే అభ్యర్థుల్ని మెయిన్స్‌కు ఎంపిక చేయాలని, తద్వారా పరీక్షల నిర్వహణకు అదనంగా అయ్యే ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే సర్దు బాటు చేస్తుందని ఏపీపీఎస్సీకి స్పష్టం చేసింది. మెయిన్స్ ఎంపికకు కటాఫ్‌గా 90.42 మార్కులను నిర్దేశించింది.
వెబ్‌సైట్లో ఫైనల్ కీ
గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫైనల్‌కీని ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్లో పొందుపరిచింది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి 23వ తేదీ వరకు ఏడు సెషన్లలో ఆఫ్‌లైన్లో జరగనుంది.
ఫలితాల వెల్లడికి తొలగిన అడ్డంకులు
పరీక్ష ఫలితాలను వెల్లడించవద్దని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఎత్తేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. దీంతో ఫలితాల వెల్లడికి మార్గం సుగమం అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment