- ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దళితులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఎన్‌హెచ్‌ఆర్సీ శుక్రవారం లేఖ రాసింది. దళితులపై అత్యాచారాల కేసులు చాలా పెండింగ్‌లో ఉన్నాయని, పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆ లేఖలో స్పష్టం చేసింది. స్థానిక పరిస్థితులు, పలుకుబడికి పోలీసులు లొంగిపోతున్నారని, దీంతో దళితులకు అన్యాయం జరుగుతోందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ బాలకృష్ణన్ నేతృత్వంలో పూర్తిస్థాయి కమిషన్ ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజులపాటు హైదరాబాద్‌లోనే బహిరంగ విచారణ చేపడుతుందని తెలిపింది. ఈ బహిరంగ విచారణ తేదీలపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ స్థానిక భాషల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. తెలంగాణలో విచారణకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమన్వయం చేయాలని ఆ లేఖలో కోరింది.
బహిరంగ విచారణ పూర్తి అయిన తరువాత వేర్వేరుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో కమిషన్ సమీక్ష నిర్వహించనుంది. రాష్ట్ర అధికార యంత్రాంగమే మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలపైన దాడులు, బెదిరింపులకు పాల్పడుతోందని కమిషన్ తప్పుపట్టింది. కొన్ని ఘటన ల్లో కార్యకర్తలపై చేయి చేసుకుంటున్నారని, ఈ అంశాలపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కోరింది.