ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: ఐపీ (ఇన్‌సాల్వెన్సీ పిటిషన్-దివాలా అర్జీ)... ఇటీవలి కాలంలో నేర వార్తల్లో తరచూ కనిపిస్తున్న, రుణ దాతలను కలవరపెడుతున్న పదమిది. లక్షల్లో, కోట్లల్లో అప్పులు చేసి.. ‘ఆర్థికంగా దివాలా తీశాను. అప్పులు చెల్లించలేకపోతున్నాను. దివాలా తీసినట్టుగా ప్రకటించాలి’ అని కోర్టును అర్థిస్తూ ఇటీవలి కాలంలో దివాలా అర్జీలు తరచూ దాఖలవుతున్నాయి. ఈ దివాలా అర్జీదారుల బాధితులు (రుణ దాతలు).. తమ నెత్తిన టోపీ పడిందంటూ లబోదిబోమంటున్నారు.
వ్యాపారులే అధికం..
కోర్టులో ఐపీ పెడుతున్న వారిలో ఎక్కువమంది ఖమ్మం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని రియల్టర్లు, బంగారపు వర్తకులు, ఫైనాన్స్ వ్యాపారులు, మధ్య తరగతికి చెందిన (పాలు, కిరాణా, సిమెంట్, కమీషన్) వ్యాపారులు ఉంటున్నారు. గత ఐదారు నెలల్లో ఐపీ పెట్టిన వారి సంఖ్య సుమారు 60కి పైగానే ఉండవచ్చని అంచనా. వీరిలో నిజంగా దివాలా తీసిన వారు ఎక్కువమందే ఉంటున్నారని, ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయన్న’ సామెతగా, ఒకప్పుడు భోగాభాగ్యాలు అనుభవించిన వారు.. కాలం కలిసిరాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, మార్గాంతరం కానరాక ఐపీ వైపు మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు చెబుతున్నారు.
ఎందుకిలా...?!
ఐపీ పెట్టాల్సిన పరిస్థితి రావడానికి అత్యాశ, అజాగ్రత్త, అవగాహన లేమి కారణమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు వ్యాపారం చేద్దామనుకుని, ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని నగరానికి వలస వచ్చి, ఏమీ చేయలేక క్రమేణా ఆర్థిక ఇబ్బందుల్లో.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇటీవలి కాలంలో ఐపీ పెట్టిన వారిలో ఖమ్మం-పరిసరాలకు చెందిన మధ్య తరగతి వ్యాపారులు ఎక్కువమంది ఉన్నారు. గత ఏడాది వరకు ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగింది. ఈ రంగంలోకి దిగిన మధ్యతరగతికి చెందిన కొందరు.. కొద్ది కాలంలోనే వ్యాపారంలో స్తబ్దత ఏర్పడడంతో.. కొన్న భూములు/స్థలాలు/ఫ్లాట్లు తిరిగి అమ్మలేక, తెచ్చిన అప్పులు తీర్చలేక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. ఇతర రంగాల్లోని (బంగారు, వ్యవసాయోత్పత్తుల కమీషన్ తదితర) వ్యాపారులదీ ఇదే పరిస్థితని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలా చేస్తే...
మనవే కాదు.. ఎదుటి వారి అనుభవాలనూ పాఠాలుగా.. గుణపాఠాలుగా భావించి, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఐపీ పెట్టాల్సిన.. అప్పులిచ్చి లబోదిబోమనాల్సిన పరిస్థితికి దూరంగా ఉండవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. సహజంగానే ప్రతి వ్యాపార రంగంలోనూ లాభ నష్టాలుంటాయి. నష్టం వస్తే తట్టుకునే స్థాయిని అంచనా వేసుకుని, తదనుగుణ జాగ్రత్తలు తీసుకుంటే ఐపీ పెట్టాల్సిన స్థితి రాకుండా చూసుకోవచ్చని సూచిస్తున్నారు. రుణదాతలు కూడా.. అప్పులు ఇచ్చేప్పుడు గ్రహీతల నేపథ్యం, వ్యాపార దక్షత, ఆర్థిక ఒడుదుడుకులను తట్టుకునే శక్తి తదితరాలను దృష్టిలో ఉంచుకుంటే మంచిదని పరిశీలకులు చెబుతున్నారు.