
మాసిపోని ‘గన్’కల్చర్
అనంతపురం: అనంతపురం జిల్లా అంటేనే టక్కున గుర్తొచ్చేది ఫ్యాక్షన్. పలు సినిమాల్లో కూడా భూతద్దంలో చూపించిన ఘటనలు.. గతంలో జరిగిన కొన్ని అనుభవాలు ఈ ముద్ర పడటానికి కారణంగా చెప్పవచ్చు. అయితే కాలం మారింది. ఫ్యాక్షన్ పూర్తిగా మాసిపోయిందని పోలీసులు పదేపదే చెబుతుంటారు. కానీ నేటికీ జిల్లాలో గన్ కల్చర్ కొనసాగుతూనే ఉంది. తుపాకీలు వినియోగించడంలో పేరు మోసిన కిల్లర్స్ అనంతలో ఉన్నారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా సుపారి ముఠా కోసం జిల్లా వైపు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ ఉదంతంలో అనంతపురం జిల్లా పేరు ప్రస్ఫుటంగా వినిపించింది.
ప్రజల్లో సానుభూతి, అప్పుల ఒత్తిళ్లు తగ్గించుకునేందుకు విక్రమ్‌గౌడ్ తనపై తానే ప్రమాదం లేకుండా కాల్పులు జరిపించుకోవాలని భావించాడు. ఇందుకోసం జిల్లాలోని కదిరికి చెందిన గోవిందరెడ్డిని సంప్రదించాడు. ఆయన ఏడు కేసుల్లో నిందితుడిగా ఉన్న నందకుమార్ అనే వ్యక్తిని కలిశాడు. ప్రాణపాయం లేకుండా విక్రమ్‌పై కాల్పులు జరిపేందుకు రూ.50 లక్షలకు సుపారి తీసుకున్నారు. తుపాకీల కోసం కదిరికి చెందిన షేక్ అహ్మద్, బాబుజాన్‌లను సంప్రదించి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి తుపాకీ తీసుకొచ్చారు. పథకం ప్రకారం విక్రమ్‌పై కాల్పులు జరిపారు. తొలుత తెలంగాణలో ఈ ఘటన కలకలం రేపినా చివరకు పోలీసులు అసలు విషయాన్ని నిగ్గు తేల్చి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఘటనలో కీలక నిందితులు జిల్లా వాసులు కావడం గమనార్హం. జిల్లాలో ఎవరు ఏం చేస్తున్నారు? వారి నేర చరిత్రలపై ఎప్పటికప్పుడు ఆరా తీయాల్సిన పోలీసు నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు హైదరాబాద్ ఉదంతంతో వినిపిస్తున్నాయి.