మొహం తిప్పేశారు
కిరణ్‌కుమార్ సమావేశానికి జిల్లా నేతలు డుమ్మా
బాపట్ల ఎమ్మెల్యే గాదె ఒక్కరే హాజరు
పదవులు పొందిన నేతలు సైతం దూరం
కొత్త పార్టీ వైపు ఇతర పార్టీల్లోని
అసమ్మతి నాయకుల చూపు
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం రాజధానిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి జిల్లా నుంచి మాజీ మంత్రి, బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి ఒక్కరే హాజరయ్యారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి గాదె మినహా ఎవరూ హాజరుకాకపోవడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు జిల్లాకు చెందిన కేంద్ర,రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్య భూమిక వహించారు. వీరిలో ఎక్కువ మంది కిరణ్‌కుమార్‌రెడ్డికి అనుచరులు, సన్నిహితులుగా మెలిగారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత వారంతా పక్కకు తప్పుకున్నారు. ఎంపీలు, మంత్రులతో ఆదివారం నిర్వహించిన సమావేశానికి జిల్లాకు చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒక్కరే హాజరయ్యారు. కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మీ, జెడి శీలంలు అధిష్టానంకు దగ్గరగా ఉంటూ సీఎంకు దూరంగా మెలిగారు.తాజాగా, ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడం మినహా కొత్త పార్టీ పెట్టలేరని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎద్దేవా చేశారు.
మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలంగా వ్యవహరించగా, కాసు కృష్ణారెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేకించినప్పటికీ, అధిష్టానానికి వ్యతిరేకంగా లేరు. ఇక ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నియోజకవర్గాలకు అధికంగా నిధులు తెచ్చుకోవడమే కాకుండా వ్యక్తిగత పనులు చేయించుకుని లబ్ధిపొందారు. వారంతా సోమవారం నాటి సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే సమావేశానికి హాజరైనప్పటికీ గాదె వెంకటరెడ్డి కూడా కిరణ్‌కుమార్‌రెడ్డిని పూర్తిగా అనుసరించే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెడితే ఎలా ఉంటుంది..పెట్టకపోతే ఎలా ఉంటుంది అనే అంశాలపై చర్చ జరిగిందని గాదె ‘సాక్షి ప్రతినిధి’కి వివరించారు. ప్రజలు, కార్యకర్తల సహకారంతో గెలిచిన తాను వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా, వారి అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోబోనని స్పష్టం చేశారు.
ఈ నెల 26న ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నానని, ఆ తరువాతే తన నిర్ణయం ఉంటుందని గాదె చెప్పారు. ఇదిలావుంటే, నామినేటెడ్ పదవులు పొందిన మరి కొందరు నేతలు కూడా సీఎం కొత్త పార్టీకి దూరంగా ఉంటున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులతో ఉడా చైర్మన్ పదవి పొందిన వణుకూరి శ్రీనివాసరెడ్డి కూడా స్పందించడం లేదు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ పదవిలో కొనసాగాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.
ఇతర పార్టీల్లోని అసమ్మతి నేతల ఆశలు
కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీపై ఇతర పార్టీల్లోని అసమ్మతి నేతలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లో సీటు రాని నేతలు ఈ పార్టీలో సీటు పొంది పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.