హైలెవల్ కెనాల్‌తో మెట్ట ప్రాంత అభివృది
అనుమసముద్రంపేట: సోమశిల జలాశయం నుంచి ఉత్తర కాలువకు సమాంతరంగా ఉదయగిరి వరకు హైలెవల్ కెనాల్ నిర్మాణం జరిగితే మెట్టప్రాంత మండలాలు అభివృద్ధి చెందుతాయని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఏఎస్‌పేట మండల వెఎస్సార్‌సీపీ కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు శనివారం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి వచ్చారు. మండలంలోని పొనుగోడు, రాజవోలు, దూబగుంట, చౌటభీమవరం, గుడిపాడు, రంగన్నపాడు, కొత్తపల్లి, పెద్దఅబ్బీపురం, చిన్నఅబ్బీపురం గ్రామాల్లో వారు విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లోని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. నీటి సమస్యలు తీరాలంటే హైలెవల్ కెనాల్ పూర్తి కావలసి ఉందన్నారు. అలాగే ఏఎస్‌పేట మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉత్తర కాలువ పనులు పూర్తి చేయిస్తామన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ అనేక గ్రామాల్లో ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తమ దృష్టికి తెచ్చారన్నారు. తాగునీటి సమస్య తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్లకు గ్రామీణులు తమ సమస్యలను చెప్పుకుని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డితో పాటు జెడ్పీటీసీ కుదారి హజరత్తమ్మ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.