
హంద్రీనీవా జల చౌర్యం
గుంతకల్లు రూరల్ : ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఒత్తిళ్లకు తలొగ్గి అనంతపురం జిల్లాకు అందాల్సిన కృష్ణ జాలలను కర్నూలుకు....
గుంతకల్లు రూరల్ :
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఒత్తిళ్లకు తలొగ్గి అనంతపురం జిల్లాకు అందాల్సిన కృష్ణ జాలలను కర్నూలుకు మళ్లించి జల చౌర్యానికి తెరతీశారని, దీనిని సహించబోమని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అన్నారు. హంద్రీనీవా నుంచి తూము ద్వారా ఏబీసీకి విడుదలవుతున్న కృష్ణా జలాలను పది రోజుల్లో నిలిపివేయాలని లేనిపక్షంలో తామే తూమును మూసివేస్తామని ఆయన హెచ్చరించారు.
సోమవారం జి.కొట్టాల సమీపంలోనున్న హంద్రీనీవా కాలువను సోమవారం ఆయన సందర్శించారు. కృష్ణా జలాలను ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు నీటి మళ్లింపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అతి తక్కువ వర ్షపాతంతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాను ఆదుకోవాలనే లక్ష్యంతో హంద్రీనీవా కాలువ నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. కానీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎక్కడపడితే అక్కడ దౌర్జన్యంగా హంద్రీనీవా నీటిని మళ్లించుకుంటూ జలచౌర్యానికి పాల్పడుతున్నారన్నారు.
కర్నూలు జిల్లాకు తుంగభద్ర నీటితోపాటు, పోతురెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణాజలాలను అధికంగా కేటాయించారన్నారు. అయితే ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు తుంగభద్ర నీరు రావడంలేదన్న ఉద్దేశంతో కర్నూలు జిల్లా నాయకులు అనంతపురం జిల్లాకు రావలసిన కృష్ణాజలాలను దౌర్జన్యంగా మళ్లించుకోవడం దారుణమన్నారు. గుంతకల్లు నియోజకవర్గంలోని చాంద్రాయుని గుట్టతోపాటు దాదాపు 20 వేల ఎకరాల ఆయకట్టుకుగుంతకల్లు సబ్ బ్రాంచ్ కెనాల్ ద్వారా అందాల్సిన తుంగభద్ర నీరు అందడంలేదన్నారు.
దానికి హంద్రీనీవా నీరు ఎందుకు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు. అనంతపురం జిల్లాకు రావలసిన తుంగభద్ర జలాలను ఓవైపు కర్ణాటక, హంద్రీనీవా జలాలను మరోవైపు కర్నూలు చౌర్యం చేస్తూపోతే జిల్లా వాసుల పరిస్థితి ఏమిటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హంద్రీనీవా కాలువను పరిశీలించిన వారిలో సీపీఐ నియోజక వర్గం కార్యదర్శి గోవిందు,పట్టణ కార్యదర్శి అబ్దుల్ వహాబ్,జాయింట్ సెక్రెటరి గుత్తి బాషా,ఎఐవైఎఫ్ నాయకుడు గౌస్ ఉన్నారు.