లగడపాటీ.. నీ భరతం పడుతం: హరీశ్‌రావు
హుజూరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంపీ లగడపాటి రాజగోపాల్ భరతం పడతామని, ల్యాంకో అక్రమాలపై విచారణ జరిపి ప్రజల దగ్గర దోచుకున్న సొమ్మంతా కక్కించి, కటకటాల వెనక్కు పంపిస్తామని టీఆర్‌ఎస్ శాసనసభపక్ష ఉపనేత హరీశ్‌రావు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
లగడపాటికి దమ్ముంటే.. ల్యాంకో వ్యవహారాలపై బహిరంగ చర్చకు రావాలని, విజయవాడలోనే వేదిక సిద్ధంచేసి, తేదీ నిర్ణయించాలని హరీష్ సవాల్ చేశారు. తెలంగాణ ఏర్పడితే దోపిడీకి అవకాశం ఉండదనే భయంతోనే.. లగడపాటి సమైక్యాంధ్ర ఉద్యమం అంటున్నాడని మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో ఉండి, తెలుగు ప్రజలు చీకట్లో ఉంటే... ల్యాంకోలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఎలా అమ్ముకున్నారు? అని ప్రశ్నించారు. సమ్మెతో రూ.వంద కోట్లు సంపాదించిన ఘనాపాటి లగడపాటే అన్నారు.
ఇలాంటి దోపిడీ దొంగల మీద ఉద్యమం చేయాలని సీమాంధ్రులకు హితవు పలికారు. రూ.900 కోట్లు తాగునీటికి, రూ.187 కోట్లు మహిళా మెడికల్ కళాశాలకు ఎలాంటి కేబినెట్, శాసనసభ తీర్మానం లేకుండా సీఎం కిరణ్ చిత్తూరు జిల్లాకు నిధులు తీసుకెళ్తుంటే తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. సీమాంధ్ర నాయకులు విభజనకు సహకరించాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధికి అందరం కలిసి పాటుపడదామని కోరారు.