ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
Published Tue, Jan 28 2014 2:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా కలెక్టరేట్ సోమవారం ఉదయం పలు ప్రజా సంఘాలు, పార్టీల ధర్నాలతో దద్దరిల్లింది. వివిధ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ.. కేవీపీఎస్.. కల్లు గీత కార్మిక సంఘం.. దళిత, గిరిజన కూలీ లు, చేతివృత్తిదారులు, వికలాంగులు, మహిళల సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఈ ధర్నాలు జరిగాయి. ఇవన్నీ ఒకేసారి జరగటంతో అటు వివిధ పనులపై కలెక్టరేట్‌కు వచ్చిన సందర్శకులు, ఇటు పోలీసులు కాస్త ఇబ్బంది పడ్డారు.
విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, దీనికి ఆధార్‌తో ముడి పెట్టవద్దని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షు డు కె.నారాయణరావు, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పైడి వేణుగోపాలం మాట్లాడుతూ బయోమెట్రిక్, ఆన్‌లైన్ విధానాల వల్ల జిల్లాలోని బడుగు, పేద వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు. ఈ ఏడాది కొన్ని కళాశాలల విద్యార్థులు ఉపకార వేతనాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. బకాయిల మొత్తం రూ.9 కోట్లకు చేరుకుందన్నారు. అనంతరం కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు వినతిపత్రం సమర్పిం చారు. ధర్నాలో పార్టీ నేతలు శవ్వాన ఉమామహేశ్వరి, పూడి తిరుపతిరావు, రౌతు చిరంజీవి, కె.వెంకట్రావు, పి.మన్మధరావు, సువ్వారి సన్యాసప్పారావు, పి.యోగేశ్వరరావు, ఎస్.వెంకటేశ్వర్లు, టి.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
101 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ దళిత, గిరిజన కూలీలు, చేతివృత్తిదారులు, మైనారిటీలు, వికలాంగులు, మహిళల సంఘాలు ధర్నా చేశాయి. ఈ సందర్భంగా సంఘాల సమన్యయ కమిటీ కన్వీనర్ టి.తిరుపతిరావు మాట్లాడుతూ 101 జీవో వల్ల అన్నింటికీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి రావటం, సమయం తక్కువగా ఉండటం, వయో పరిమితి తగ్గించటం వల్ల నిరక్ష్యరాస్యులు, గ్రామీణ ప్రాంతాల్లోని పైవర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కార్యక్రమాలు, రుణాలకు సంబంధించిన సెలక్షన్ కమిటీలో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలన్నారు. ధర్నాలో సంఘాల నేతలు కె.అప్పారావు, డి.గణేశ్, కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కల్లుగీత కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం నేతలు కె.అప్పారావు, దుబ్బ కోటేశ్వరరావు, డి.సూర్యనారాయణలు మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి భద్రత లేదని అన్నారు. గీత కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘం నేతలు టి.సింహచలం, డి.గణేశ్, దానయ్య, ఏ.గోదావరి, కె.మోహనరావు, తిరుపతిరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో దళితులకు ఇచ్చిన పట్టాలకు వెంటనే సబ్ డివిజన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకా లు, యాజమాన్య హక్కు పుస్తకాలు వెంటనే అందజేయాల ని కోరుతూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నేతలు బి.అచ్చెయ్య, తాండ్ర అరుణ మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం డి-పట్టాలిచ్చినా ఇంతవరకు సబ్ డివిజన్ చేయలేదన్నారు. దీనివల్ల వీరి భూములను పెత్తందార్లు ఆక్రమించుకుంటున్నారని చెప్పారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ధర్నాలో సంఘం సభ్యులు దంతూలుని వర్మ, బంటు గురుమూర్తి, బి.గణేశ్, దాసరి సింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement