స్థానికతపై మెలిక రాజ్యాంగ విరుద్ధం
జి.కిషన్‌రెడ్డి
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 1956 సంవత్సరాన్ని కటాఫ్‌గా నిర్ధారిస్తూ స్థానికతపై మెలిక పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయలేని తెలంగాణ ప్రభుత్వం తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే స్థానికత అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.
శాసనసభలోని 119 మంది ఎమ్మెల్యేలు 1956 స్థానికత సర్టిఫికేట్లు తెస్తారా.., ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడకలో ఆనాటి రికార్డులు ఉన్నాయా.. అని ప్రశ్నించారు. భూముల్లేని ఎస్సీ, బీసీలు ఆనాటి రికార్డులను ఎలా తీసుకురాగలరన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ను ప్రాంతీయ సమస్యగా చూపొద్దని, ఫాస్ట్ పథకం వల్ల బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు నష్టపోతారని కిషన్‌రెడ్డి అన్నారు