1956కటాఫ్‌పై పునరాలోచన
‘రీయింబర్స్‌మెంట్’పై సీఎం సమీక్ష
తేల్చుకోలేకపోతున్న సర్కార్
1974 ఆధారంగా స్థానికత నిర్ధారణ ?
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన స్థానికత అంశంపై తెలంగాణ సర్కార్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటివరకు 1956ను కటాఫ్‌గా నిర్ణయించాలని భావించిన ప్రభుత్వం తాజాగా 1974 ఆధారంగా స్థానికతను నిర్ధారించే విషయం కూడా పరిశీలిస్తోంది. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో ఈ విషయంపై సమీక్షించారు. నిన్నటివరకు 1956 ఆధారంగా స్థానికత నిర్ణయించాలని భావించిన ప్రభుత్వం ప్రస్తుతం పునరాలోచనలో పడింది. సీఎం నిర్వహించిన సమీక్షలో 1974 అంశం పరిశీలనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అన్నది ఆంధ్రప్రదేశ్ పథకమని, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకానికి రూపకల్పన చేస్తామని చెబుతూ, తెలంగాణేతరులకు లబ్ధి చేకూరకుండా చూడడం, అదేసమయంలో తెలంగాణ విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది. 1956కు ముందునుంచి ఉన్నవారెవరో నిర్ణయించడంలో ఉన్న చిక్కుల కారణంగా 1974 అంశం తెరపైకి వచ్చినట్టు సమాచారం. కాగా, ఇంజనీరింగ్ ప్రవేశాల గడువుపై సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు ఫీజురీయింబర్స్‌మెంట్, స్థానికతలపై మార్గదర్శకాలు వెల్లడవుతాయి. ప్రభుత్వం కోరినట్టు అక్టోబర్ వరకు ప్రవేశాల గడువు పెంచకపోతే ఇవి త్వరలో వెలువడే అవకాశం ఉంది.