'ఆయన జోకర్కి ఎక్కువ, బఫూన్కి తక్కువ'
కాకినాడ: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు జోకర్కి ఎక్కువ, బఫూన్కి తక్కువ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఎద్దేవా చేశారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో హర్షకుమార్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీలు సమాన పాత్ర పోషించాయని ఆరోపించారు. ఏపీలో రైతులకు బద్ధ శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది సీఎం చంద్రబాబే అని ఆయన స్పష్టం చేశారు.
అధికారంలోకి వచ్చిన ప్రతీసారి రైతులను అన్యాయం చేస్తున్నాడని చంద్రబాబుపై హర్షకుమార్ నిప్పులు చెరిగారు. విభజన చట్టంలోని హామీలు అమలు కావాలంటే పార్లమెంట్ సమావేశాలను స్తంభింప చేయాలని ఆయన కాంగ్రెస్కు హితవు పలికారు. అలా చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఏర్పడే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. నందిగామ, తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి మరో తప్పు చేసిందని ఈ సందర్బంగా హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.