ప్రతీకాత్మక చిత్రం
ఆళ్లగడ్డ : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి శ్రద్ధ కొరవడింది. వారు కనీసం వైద్యపరీక్షలకు నోచుకోవడం లేదు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నా.. సకాలంలో గుర్తించలేని పరిస్థితి. ఒకవేళ తల్లిదండ్రులు గుర్తించి వైద్యం చేయిస్తే సరి. లేదంటే అలాగే తరగతులకు హాజరై.. చదువుపై ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడాల్సి వస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2010 నవంబర్ 14న జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘బాల్యానికి భరోసా..బాల ఆరోగ్య రక్ష’ నినాదంతో అమల్లోకి తెచ్చింది. ఇందులో సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), పాఠశాల విద్యాశాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం)లను భాగస్వాములుగా చేసింది.
ఈ పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల నిర్వహణలోని అన్ని పాఠశాలలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలి. జిల్లాలో ఇలాంటి పాఠశాలలు 4,113 ఉన్నాయి. వీటిలో ఒకటి నుంచి పదోతరగతి వరకు 6,41,530 మంది చదువుతున్నారు. వీరికి చెవి, ముక్కు, కన్ను, దంత, గుండె, ఊపిరితిత్తులు, ఉదరం తదితర 30 రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యత సంబంధిత వైద్యాధికారి తీసుకోవాలి.
ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లు తేలితే తగిన చికిత్స అందజేయాలి. మెరుగైన వైద్యం అవసరమైతే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఈ పథకంపై మొదట్లో హడావుడి చేసిన అధికారులు తర్వాత చేతులెత్తేశారు. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడా వైద్య పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. విద్యాసంవత్సరం కూడా పూర్తి కావస్తోంది. అయినా ఎవరూ దృష్టి పెట్టడం లేదు. కొన్ని పాఠశాలలకు ఏఎన్‌ఎంలు వెళ్లి అరకొర మందులిచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ప్రతి గురువారం ఆరోగ్య దినోత్సవం నిర్వహించాల్సి ఉండగా..దీన్ని కూడా అటకెక్కించారు.
మూడేళ్లుగా కార్డులివ్వలేదు!
ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ఆరోగ్య కార్డులు అందజేయాలి. వారికి ఏయే వైద్య పరీక్షలు చేశారు.. ఏ మందులు అందజేశారు.. వ్యాధి ఎన్ని రోజుల నుంచి ఉంది.. పాఠశాలకు ఎన్ని రోజులు రాలేదు.. గతంలో వారి కుటుంబ సభ్యులకు ఇలాంటి వ్యాధులు ఉన్నాయా...తదితర వివరాలను ఆ కార్డుల్లో నమోదు చేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత, క్రమం తప్పకుండా ఇచ్చే మందులు, ట్రీట్‌మెంట్, టీకాల వివరాలనూ పొందుపర్చాలి.
దీర్ఘకాలిక/తీవ్ర అనారోగ్య సమస్య ఉన్న వారు ఈ కార్డు తీసుకుని కర్నూలు సర్వజన వైద్యశాలకు వెళితే అక్కడ ప్రత్యేకంగా నియమించిన అధికారి.. సంబంధిత వైద్యుల వద్దకు తీసుకెళ్లి చికిత్స ఇప్పిస్తారు. అయితే.. మూడేళ్ల నుంచి విద్యార్థులకు ఈ కార్డులు ఇవ్వడం లేదు. దీంతో పాటే వైద్యపరీక్షలూ ఆగిపోయాయి. విద్యార్థులకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే తల్లిదండ్రులు సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు.
గడిచిన వర్షాకాలం, చలికాలాల్లో సీజనల్ వ్యాధులకు గురై చాలా ఇబ్బంది పడ్డారు. వారివైపు కన్నెత్తి చూసిన వైద్యులు గానీ, అధికారులు గానీ లేరు. ప్రస్తుతం ఎండలు ముదురుతున్నాయి. వార్షిక పరీక్షలు కూడా దగ్గర పడ్డాయి. ఈ తరుణంలో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో వ్యవహరించి.. వైద్య సేవలను పునరుద్ధరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఏఎన్‌ఎంలు వచ్చి వెళ్తుంటారు
స్థానికంగా ఉండే ఏఎన్‌ఎంలు మాత్రమే అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. వైద్యాధికారులు వచ్చి వైద్యపరీక్షలు గాని, చికిత్స గాని చేయడం లేదు. కనీసం మూడేళ్లుగా ఆరోగ్య కార్డులు కూడా పంపిణీ చేయలేదు. దీంతో ఆరునెలలకోసారి నిర్వహించాల్సిన ప్రత్యేక వైద్య పరీక్షలు, చికిత్సలు ఆగిపోయాయి.
– వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం, అహోబిలం
కార్డులు ప్రింటవుతున్నాయి
కార్డుల పంపిణీ ఆగిన మాట వాస్తవమే. కార్డులు లేవని వైద్యం ఆపవద్దని సూచించాం. అవసరమైతే జిరాక్స్ తీసి నమోదు చేయాలని ఆదేశాలిచ్చాం. పాత కార్డులు ఎక్కువ పేజీలు ఉన్నాయి. దీంతో కొత్తగా తక్కువ పేజీలతో కార్డులు ప్రింట్ చేయిస్తున్నాం. త్వరలోనే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– హేమలత, జవహర్ బాల ఆరోగ్య రక్ష జిల్లా కో–ఆర్డినేటర్
మాకు సంబంధం లేదు
బాల ఆరోగ్య రక్ష పథకం అమలుతో మాకు ఎలాంటి సంబంధమూ లేదు. అంతా వైద్య,ఆరోగ్య శాఖ వారే చూసుకోవాలి.
– తిలక్ విద్యాసాగర్ , సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment