ఖాకీలకు హెల్త్ టెన్షన్స్! | Health tensions to Policies | Sakshi
Sakshi News home page

ఖాకీలకు హెల్త్ టెన్షన్స్!

Published Mon, Aug 12 2013 4:42 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM

Health tensions to Policies

హైదరాబాద్, న్యూస్‌లైన్: పోలీస్... ఖాకీ డ్రెస్‌లో కరుకుగా కనిపించే పోలీసులకు పండగా పబ్బం ఉండవు.. వారాంతపు సెలవు ఊసే లేదు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలూ విధుల్లోనే.. ఇక సిబ్బంది కొరత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా నిరంతరాయంగా పనిచేయడం వల్ల ఖాకీలు తీవ్రమైన పని ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో సమయానికి ఆహారం తీసుకునేందుకు, నిద్ర పోయేందుకు కూడా వారికి సమయం ఉండటంలేదు. వీటికి తోడు శారీరక వ్యాయామంపై నిర్లక్ష్యం, మద్యం, ధూమపానం వంటి అలవాట్లు పోలీసుల పాలిట శాపంగా మారుతున్నాయి. వీటన్నిటి ఫలితంగా దొంగలు, హంతకులు, దోపిడీదారులను గడగడలాడించాల్సిన ఖాకీలు కాస్తా దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నారు. వివిధ రోగాల కారణంగా మృతి చెందుతున్న పోలీసుల సంఖ్య ఏటా 500కు పైగానే ఉంటోందని సమాచారం.
 
 పోలీసు సిబ్బంది ప్రాణాలు తీస్తున్న వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైన కేన్సర్‌దే మొదటి స్థానం. పోలీసు శాఖలో ఆరోగ్య భద్రత ద్వారా చికిత్స పొందిన సిబ్బంది, వారి కుటుంబీకుల వివరాల ప్రకారం కేన్సర్ బాధితుల సంఖ్య ఏడాదికి 800కుపైనే ఉంటోంది. కేన్సర్ బాధిత పోలీసుల్లో ఎక్కువ మంది 45 ఏళ్లలోపు వారుకావడం ఆందోళన కలిగించే అంశం. ఉదరకోశ, నోరు, రక్త సంబంధిత కేన్సర్ కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నాయి.ఇక, పోలీసు సిబ్బంది జీవిత భాగస్వాముల్లో గర్భకోశ, ఛాతీ కేన్సర్ కేసులు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. సకాలంలో వైద్యులను సంప్రదించని కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందని వైద్య నిఫుణులు చెపుతున్నారు.
 
 

కేన్సర్ తర్వాత గుండెజబ్బులు, మూత్రపిండాలు, కీళ్ల సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులతో ఏటా ఐదొందల మంది వరకూ ఇబ్బందులు ఎదుర్కొంటుండగా వంద వరకూ హృద్రోగ శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. మూత్రపిండ సంబంధిత వ్యాధులతో బాధ పడేవారి సంఖ్య కూడా ఏటా 700 దాటుతోంది. ఇక ట్రాఫిక్‌లో పనిచేసేవారిలో అత్యధికులు శ్వాస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. అలాగే, అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌లో పాల్గోనే సాయుధ పోలీసులు అనారోగ్యం పాలై ప్రాణాలు పోగొట్టుకుంటున్న సందర్భాలూ ఉంటున్నాయి. నెలల తర బడి కుటుంబాలకు దూరంగా గడిపే ఏపీఎస్పీ సిబ్బంది హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు. దీంతో సాయుధ బలగాలకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
 
 ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్
 పోలీసు సిబ్బంది ఆరోగ్య సమస్యలపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 40 ఏళ్లు దాటిన పోలీసులకు దశల వారీగా ‘మాస్టర్ హెల్త్ చెకప్’ చేయిస్తున్నారు. ఈ ఏడాది నుంచి తొలిసారిగా పోలీసుల భార్యలకు కూడా ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ అవకాశం కల్పిస్తున్నారు. జిల్లాల వారీగా జరుగుతున్న ఈ పరీక్షల్లో అనేక వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. వైఎస్‌ఆర్ జిల్లాలో పోలీసులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా.. ఎనిమిది మందికి అత్యవసర ఆపరేషన్ చేయాలని గుర్తించారు. గుంటూరు అర్బన్, తిరుపతి అర్బన్ జిల్లాల్లోనూ దీర్ఘకాలిక వ్యాధులున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో 4,118 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పని ఒత్తిడి కారణంగా మధ్యవయస్సు దాటిన సిబ్బందిలో బీపీ, మధుమేహం వంటి వ్యాధులు సర్వసాధారణంగా మారాయి.
 
 సిబ్బందికి ‘ఆరోగ్య భద్రత’
 పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆరోగ్య భద్రత విభాగం ద్వారా పూర్తిస్థాయి వైద్య ఖర్చులను పొందే అవకాశం ఉంది. సిబ్బంది, వారి కుటుంబీకుల (భార్య, ముగ్గురు మైనర్లు) ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య భద్రత పథకం పేరిట 1997 నుంచి ఒక ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు పోలీసు శాఖలో పనిచేస్తున్న లక్ష మంది సిబ్బంది ఈ విభాగంలో సభ్యులుగా ఉంటారు.
 
  సిబ్బందిలో ప్రతి ఒక్కరూ ప్రతి నెలా రూ. 65 చొప్పున ఆరోగ్య భద్రత ఖాతాకు జమ చేస్తారు. ఈ మొత్తాన్ని పోలీసుల ఆరోగ్యం కోసం వె చ్చిస్తున్నారు. ముఖ్యమైన 14 జబ్బులను గుర్తించేందుకు పరీక్షల దగ్గర నుంచి శస్త్రచికిత్సల వరకు ఆరోగ్య భద్రత ద్వారా సిబ్బంది వైద్య సేవలు పొందవచ్చు. దేశవ్యాప్తంగా గుర్తించిన 80 పైగా ఆస్పత్రుల్లో పోలీసు సిబ్బంది ఒక్కొక్కరూ వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఏడాదికి గరిష్టంగా రూ. 8 లక్షల వరకు ఆరోగ్య భద్రత ద్వారా పొందవచ్చు. మూడున్నరేళ్ల కాలంలో ఆరోగ్య భద్రత ద్వారా రూ. 95.64 కోట్లను పోలీసు శాఖ ఖర్చు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement