ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆరు రోజులుగా ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. మరోవైపు ఈ సమ్మె వల్ల రోజురోజుకూ ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతోంది. ఆరు రోజుల సమ్మె వల్ల జిల్లాలో సంస్థకు రూ.9 కోట్ల మేర నష్టం మిగిలింది.
సాక్షి, విజయవాడ : జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సోమవారం కూడా నిరసన ర్యాలీలు, మౌన ప్రదర్శనలు, ధర్నాలు కొనసాగించారు. విజయవాడలోని పాత బస్‌స్టాండ్ సెంటర్‌లో ఆర్టీసీ కార్మికులు బహిరంగ సభ నిర్వహించారు. దీనికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ముఖ్యఅతిథులుగా హాజైరై కార్మికులకు మద్దతు తెలిపి, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ నాయకులు గుర్రం విజయ్‌కుమార్, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి సుందరరామరాజుతో పాటు వామపక్ష పార్టీల జిల్లా, నగర కార్యదర్శులు, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.
జిల్లాలోని పలు డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. గుడివాడ బస్‌డిపో నుంచి కార్మిక సంఘాలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరువూరులో ర్యాలీ, అనంతరం అఖిలపక్ష పార్టీల నేతలతో కలిసి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జగ్గయ్యపేటలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన, ఆ తరువాత మౌన ప్రదర్శన జరిపారు.
నష్టాల ఊబిలో ఆర్టీసీ
కార్మికుల సమ్మె వల్ల రోజురోజుకు ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. జిల్లాలోని 14 డిపోల్లో మొత్తం 1440 బస్సులు ఉన్నాయి. సమ్మె తొలి రోజు కేవలం పదిశాతం బస్సులు, రెండో రోజు నుంచి నాలుగో రోజు వరకు సగటున 40 శాతం బస్సులు, నాలుగు నుంచి ఆరు రోజులు 50 నుంచి 60 శాతం వరకు బస్సు సర్వీసులను కాంట్రాక్ట్ కార్మికులతో, హైయర్ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లతో నడిపారు. అయినప్పటికీ బస్సులు పూర్తి స్థాయిలో తిరగకపోవడం వల్ల ఇప్పటి వరకు రూ.9 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. రోజుకు బస్సు సర్వీసుల ద్వారా ఆర్టీసీకి సగటున రూ.1.75 కోట్ల ఆదాయం వస్తుంది. డ్రైవర్‌కు రోజుకు రూ.1000, కండక్టర్‌కు రూ.800 చెల్లిస్తున్నారు. బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతూ ప్రయాణిస్తున్నా టికెట్లు ఇవ్వకపోవడంతో ఆదాయం ఆశించిన మేరకు రావడంలేదు.
కదంతొక్కిన ఆర్టీసీ కార్మికులు
అవనిగడ్డ : స్థానిక ఆర్టీసీ డిపో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆరో రోజూ కొనసాగింది. ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ ధోరణిని నిరశిస్తూ అఖిలపక్ష (బీజేపీ, టీడీపీ మినహా) నాయకులతో కలసి కార్మికులు బస్‌స్టాండు సెంటరులో సోమవారం రాస్తారోకో చేశారు. తొలుత డిపో నుంచి వంతెన సెంటరు వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మోసం, దగా, వెన్నుపోటు తప్ప ప్రజల సంక్షేమం పట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీని ప్రయివేటు పరంచేసి టీడీపికి నిధులు సమకూర్చే నాయకులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎన్నికల తరుణంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు చంద్రబాబును కలిసిన తరుణంలో తాను మారిన మనిషినని, తనను నమ్మితే న్యాయం చేస్తానంటూ వాగ్దానాలు చేశారని గుర్తుచేశారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు రూ.12 వేల వరకూ వేతనం చెల్లిస్తున్న ప్రభుత్వం ఆర్టీసీ డ్రైవర్లకు మాత్రం రూ.7180 ఇవ్వడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోపాటు తామంతా అండగా నిలుస్తామని సారథి భరోసా ఇచ్చారు.
ఆర్టీసీకి రూ.9 కోట్ల నష్టం
Published Tue, May 12 2015 1:55 AM | Last Updated on Mon, Aug 13 2018 7:24 PM