ఒంగోలు టౌన్: జిల్లాకు భారీ వర్ష సూచన ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ(ఇండియన్ మెట్రాలాజికల్ డిపార్టుమెంట్) నుంచి సమాచారం అందింది. దీంతో కలెక్టర్ విజయకుమార్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అందరు జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో సిద్ధంగా ఉండాలని, ఉద్యోగులు తమ హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు.
సిబ్బంది అప్రమత్తం గా ఉండాలని, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే జిల్లా యంత్రాంగానికి వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. బుధవారం తెల్లవారుజాము నుంచే జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఇప్పటికే కోస్తాలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి.
కలెక్టరేట్, తహశీల్దార్ కార్యాలయాల్లోకంట్రోల్ రూమ్‌లు
భారీ వర్షాల హెచ్చరికలతో కలెక్టరేట్‌తోపాటు అన్ని మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్(08592 - 231400, టోల్ ఫ్రీ నెం 1077)ను ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు తోడు బలంగా గాలులు వీచే అవకాశాలు ఉండటంతో ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. తీర ప్రాంత మండలాలైన ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, చినగంజాం, వేటపాలెం, చీరాల, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరులో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకొంది.
జిల్లాకు భారీ వర్షసూచన
Published Thu, Dec 11 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement