విజయవాడ : కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30గంటల వరకు పిడుగులతో కూడిన వర్షం పడింది. దివిసీమలో కురిసిన వర్షానికి అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లో వందల ఎకరాల్లో మామిడి రాలిపోయింది. కొన్నిచోట్ల కరెంటు తీగలు తెగిపోవడంతో సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 216 నంబరు జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. చెట్లు విరిగిపోవటంతో హనుమాన్ జంక్షన్‌లో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కలిదిండి మండలంలో పడిన పిడుగుల ధాటికి విద్యుత్ మీటర్లు, పలు పరికరాలు దెబ్బతిన్నాయి. జిల్లాలో 25.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
కాగా పిడుగుపాటుకు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు. మచిలీపట్నం మండలం గుండుపాలెం అడ్డరోడ్డు వద్ద పిడుగుపడి గొరిపర్తి రవితేజ (17) అనే యువకుడు మరణించాడు. తిరువూరు మండలం చిక్కుళ్లగూడెంలో మామిడి తోటల్లో కాయలు కోయటానికి వెళ్ళిన ముచ్చింతాల రాజశేఖర్(22), అతని మేనల్లుడు గిరిశెట్టి గోపీచంద్ (13) పిడుగుపడడంతో షాక్‌కు గురై మరణించారు.
కృష్ణాజిల్లాలో భారీ వర్షం : ముగ్గురు మృతి
Published Mon, Jun 1 2015 7:44 PM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM
Advertisement