ఈశాన్య రుతుపవనాలు,ఆవర్తనద్రోణి ప్రభావంతో జిల్లా అంతటా మంగళవారం వర్షం పడింది. ఉదయంనుంచి సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా కురిసింది.
సాక్షి, విశాఖపట్నం : ఈశాన్య రుతుపవనాలు,ఆవర్తనద్రోణి ప్రభావంతో జిల్లా అంతటా మంగళవారం వర్షం పడింది. ఉదయంనుంచి సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా కురిసింది. వాతావరణం చల్లబడింది. తీరం వెంబడి అలలు ఎగిసి పడుతున్నాయి. జిల్లా మొత్తంగా సరాసరి 2.4 సెంటీమీటర్లుగా నమోదయింది. నక్కపల్లిలో అత్యధికంగా 12 సెంటీమీటర్లు, జీకేవీధిలో అత్యల్పంగా 2.6 సె.మీ. వర్షం పడింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని నదులు, వాగులు, కొండగెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే నిండుగా ఉన్న జలాశయాల్లోకి ఎగువ నుంచి భారీ ఎత్తున వరదనీరు వచ్చిపడుతోంది. నక్కపల్లి,పాయకరావుపేట, అడ్డురోడ్డులలో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
అనకాపల్లిలో 9.4 సెంటీమీటర్ల వర్షం పడింది. శారదానదిలో నీటి మట్టం పెరిగింది. ఈ మండలంలోని దేవీనగర్ పరిసర లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఏజెన్సీలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వాటికి చలిగాలులు తోడవ్వడంతో గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారు. మన్యంలోని వాగులు, గెడ్డల్లో నీటి ఉధృతి పెరిగింది. అరకులోయ పరిసరాలు భారీ వర్షంతోపాటు దట్టమైన పొగమంచుతో శోభాయమానంగా మారాయి. పర్యాటకులను, స్థానికులను కనువిందు చేసింది. పండువెన్నెలలో చంద్రుని మాదిరి ఉదయం 10 గంటలకు భానుడ్ని చూసి పర్యాటకులు పరవశించిపోయారు. వర్షం కారణంగా వ్యవసాయ పనులకు వెళ్లకుండా గిరిరైతులు ఇళ్లకే పరిమితమయ్యారు. యలమంచిలి నియోజకవర్గంలోనూ భారీ వర్షం కురిసింది. కోటవురట్ల మండలంలోని దుగ్గాడ కాలువలో జలకళ ఉట్టిపడుతోంది.
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలోనూ వర్షం ముంచెత్తింది. నదులు, చెరువుల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. ఈ ప్రాంతంలోని కొండగెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు ప్రమాదస్థాయికి చేరుకున్నాయి. అత్యధికంగా చీడికాడలో 5సెంటీమీటర్లు వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోని పంటపొలాలన్నీ నీటమునిగాయి. పెద్దేరు, కోనాం జలాశయాల్లో నీటిని విడుదలకు అధికారులు సిద్ధమవుతున్నారు.