భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నా రు. మంథని మండలం చల్లపల్లికి చెందిన రొడ్డ అనిల్(24) ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వరి పంటలు వేశాడు. భారీ వర్షాలకు పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నది.
మంథనిరూరల్/భీమదేవరపల్లి, న్యూస్‌లైన్: భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నా రు. మంథని మండలం చల్లపల్లికి చెందిన రొడ్డ అనిల్(24) ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వరి పంటలు వేశాడు. భారీ వర్షాలకు పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నది. గత సంవత్సరం కూడా కౌలు భూమిలో పత్తి వేయగా వర్షాభావంతో నష్టం వచ్చింది. అప్పులు రూ.రెండు లక్షలకు చేరడంతో మనస్తాపం చెందిన అనిల్ సోమవారం రాత్రి క్రిమిసంహారకమందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. అనిల్‌కు ఏడాది క్రితం పెళ్లికాగా, భార్య ఉంది. భీమదేవరపల్లి మండలం ఎర్రబల్లితండాకు చెందిన మాలోతు సమ్మయ్య(40)ఎర్రమట్టిని ఎడ్లబండిలో తీసుకెళ్లి గ్రామాల్లో అమ్ముకునేవాడు. ఈ సంపాదనతో కుటుంబ పోషణ గగనమైంది.
దీంతో ఈ ఏడాది రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తిపెట్టగా, వర్షాలకు తెగుళ్లు సోకి పంట దెబ్బతిన్నది. ఇదేసమయంలో అనారోగ్యంతో ఎద్దు చనిపోయింది. మళ్లీ ఎర్రమట్టిని అమ్ముకుందామని మరో ఎద్దు కొనుగోలు చేయాలనుకున్నాడు. డబ్బుల కోసం భార్య లలితను రెండు రోజుల క్రితం ఆమె తల్లిగారింటికి పంపించాడు. సోమవారం భార్యకు ఫోన్ చేసి డబ్బుల విషయం అడుగగా ఇంకా కాలేదని చెప్పింది. మనస్తాపం చెందిన సమ్మయ్య మంగళవారం క్రిమిసంహరక మందుతాగాడు. చుట్టుపక్కలవారు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అతికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.