పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న హెలెన్ తుపాన్ తీవ్ర తుఫాన్గా మారిందని విశాఖపట్నంలోని వాతావరణశాఖ వెల్లడించింది. ఒంగోలుకు తూర్పు దిశగా 360 కిలోమీటర్ల దూరంలో హెలెన్ కేంద్రీకృతమైందని తెలిపింది. రేపు మధ్యాహ్నం హెలెన్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో రేపు ఉదయం కోస్తాంధ్రకు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. అలాగే దక్షిణ కోస్తాలో కూడా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది. సముద్ర తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాను తీవ్రత దృష్ట్యా పోర్టులో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ ఓడరేవులో ఏడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నంలలో ఆరో నెంబర్ ప్రమాద హెచ్చరిక...కాకినాడ, విశాఖ, గంగవరం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. హెలెన్ తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. నెల్లూరులో 35 అడుగుల మేర ముందుకు చొచ్చుకుని వచ్చింది. కాకినాడ సముద్రతీరంలో అలలు ఎగసిపడుతున్నాయి.