తెలంగాణ ఏర్పాటైన తర్వాత కొత్తగా ఏర్పడే జిల్లాల్లో ఒక జిల్లాకు జయశంకర్ పేరు పెడుతామని, ఆయన పేరున ప్రతీ మండలానికో ఇంగ్లిషు మీడియం...
ధూల్మిట్ట(మద్దూరు), న్యూస్‌లైన్ : తెలంగాణ ఏర్పాటైన తర్వాత కొత్తగా ఏర్పడే జిల్లాల్లో ఒక జిల్లాకు జయశంకర్ పేరు పెడుతామని, ఆయన పేరున ప్రతీ మండలానికో ఇంగ్లిషు మీడియం స్మారక పాఠశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు బోధన చేయిస్తామని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు అన్నారు. మద్దూరు మండలం ధూల్మిట్టలో ధూల్మిట్ట డెవలప్ మెంటు ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని ఆయన కోదండరాంతో కలిసి బుధవారం ఆవిష్కరించారు.
అనంతరం ఫోరం అధ్యక్షుడు శివ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ తమకు ఉద్యమాల ఓనమాలు నేర్పింది జయశంకర్ సార్ అని, తెలంగాణ.. సీమాంధ్రల దోపిడీకి గురైన విధానాన్ని గత 60 సంవత్సరాల లెక్కలను రాసి ఇంగ్లీష్‌లో సీడీని తీసి భారదేశం అంతటా ప్రచారం చేసిన వ్యక్తి జయశంకర్‌సారని అన్నారు. తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో.. వచ్చిన తెలంగాణను నిర్మించుకోవడం అంతే ముఖ్యమని, ఈ మాట జయశంకర్ సార్ తరచూ అనే వారని గుర్తు చేశారు.మేధావి నిశ్శబ్దంగా ఉంటే ఉగ్రవాదం కంటే ప్రమాదమైందని చాటిచెప్పిన మహానీయుడని కొనియూడారు.
సీఎం కిరణ్ రూ. 5800 కోట్లను తన చిత్తూరు జిల్లాకు మంచినీటి కోసం తీసుకెళ్తున్నా తెలంగాణ మంత్రులు నోరుమెదపడం లేదని విమర్శించారు. సభలో కవి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ నిస్వార్థంగా తన జీవితాన్ని తెలంగాణ ప్రజలకు అర్పించిన మహా త్యాగశీలి జయశంకర్‌సారు అని అన్నారు. సారు ఆశీర్వాదంతోనే కే సీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించారని అన్నారు. ప్రతీ విషయంలో కేసీఆర్‌కు జయశంకర్ అండగా ఉండి ఉద్యమానికి నిఘంటువుగా నిలిచాడన్నారు.
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ముత్తిరెడ్డి యూదగిరిరెడ్డి మాట్లాడుతూ 60 సంవత్సరాలుగా తెలంగాణ కోసం పోరాడి.. తెలంగాణ ఏర్పాటు తరుణంలో జయశంకర్ సారు లేక పోవడం బాధాకరమన్నారు. ఆయన మన మధ్యలో లేకున్నా ఆయన ఆశయాలు మాత్రం సజీవంగా ఉన్నాయన్నారు. అనంతరం గిద్దె రాంనర్సయ్య కళాబృందం ఆధ్వర్యంలో ధూంధాం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ పాపిరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు, రాష్ట్ర ఇంజనీర్ల జేఏసీ నాయకులు ముస్త్యాల బాలనర్సయ్య, మద్దూరు,నర్మెట్ట మండలాల పార్టీ అద్యక్షులు తాడెంశ్రీనివాస్, గద్దల నర్సింగరావు,బక్కనాగరాజు,బర్మరాజమల్లయ్య,జక్కిరెడ్డి సుదర్శన్‌రెడ్డి,గ్రామసర్పంచ్ పద్మ, ఉపసర్పంచ్ తుశాలపురం కనకయ్య వివిధ గ్రామాల కార్యకర్తలు, కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు.