
తప్పు చేస్తే జరిమానా విధించడం పరిపాటి. కానీ నగరి పోలీసులు మాత్రం జరిమానా బదులు హెల్మెట్ అందజేస్తున్నారు. ఊరికే కాదండోయ్.. జరిమానాగా విధించిన మొత్తానికే..
నగరి: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎన్నిసార్లు పోలీసులు చెబుతున్నా కొందరు వాటిని పెడచెవిన పెడుతున్నారు. దీంతో జరిమానాలు భారీగా పెంచేశారు ట్రాఫిక్ పోలీసులు. అయితే పట్టుబడ్డప్పుడు చూసుకోవచ్చులే అనే నిర్లక్ష్యంతో కొందరు హెల్మెట్ ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారు.
ఈ క్రమంలో చిత్తూరుజిల్లా నగరి పట్టణ పరిధిలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై ఆదివారం పోలీసులు దృష్టి సారించారు. ఓంశక్తి ఆలయం సమీపంలోని బైపాస్ సర్కిల్ వద్ద హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిని ఆపి జరిమానా కింద హెల్మెట్‌ను అందజేశారు. రూ.500 జరిమానాకు బదులుగా రూ.535కే హెల్మెట్ ఇవ్వడంతో వాహనదారులు జరిమానాకు బదులుగా హెల్మెట్లను కొనుగోలు చేసుకున్నారు. వాహనాలపై సుదూరం ప్రయాణించేవారు క్షేమంగా వెళ్లి తిరిగి ఇళ్లకు చేరుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment