
యానిమేటర్ నుంచి.. యాక్టర్ వరకు
హీరో చింతలపూడి వెంకట్. ప్రస్తుతం గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో షూటింగ్ జరుపుకొంటున్న ‘ఈ నేల-ఈ గాలి’ సీరియల్‌లో హీరోగా నటిస్తున్న ఆయన గురువారం కొద్దిసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు.
వేలల్లో జీతం.. కాలు కదపకుండా కూర్చుని చేసే ఉద్యోగం.. హాయ్‌హాయ్‌గా రాయల్టీ లైఫ్ గడుపుతున్న ఆ యువకుడు నటనపై ఉన్న ఆసక్తితో వాటన్నింటికీ స్వస్తి చెప్పాడు. కెనడాకు చెందిన మొబల్టీ ఆర్ట్ స్టూడియోలో యానిమేటర్‌గా ఉద్యోగాన్ని వదులుకుని సినిమాలు, సీరియల్స్‌లో నటించేందుకు అడుగు వేశాడు. అతని కష్టం ఊరికే పోలేదు. ఇప్పుడు చేతినిండా సినిమాలు, సీరియల్స్‌తో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించాడు. అతనే వర్ధమాన నటుడు, హీరో చింతలపూడి వెంకట్. ప్రస్తుతం గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో షూటింగ్ జరుపుకొంటున్న ‘ఈ నేల-ఈ గాలి’ సీరియల్‌లో హీరోగా నటిస్తున్న ఆయన గురువారం కొద్దిసేపు ‘సాక్షి’తో
ముచ్చటించారు.
- కౌతవరం (గుడ్లవల్లేరు)
సాక్షి : మీ స్వస్థలం?
వెంకట్ : ప్రకాశం జిల్లా పరుచూరు మండలం, ఉప్పుటూరు గ్రామం.
సాక్షి : ఏ సినిమాల్లో నటించారు?
వెంకట్ : రాబోయే ‘బ్యాండ్‌బాలు’ సినిమాలో హీరోతో పోటీపడే విధంగా సాంగ్ కాంపిటేటర్‌గా నటించా. ఒక పాటంతా నాదే. 20 నిమిషాలు తెరపై కనిపిస్తా. ఇటీవల విడుదలైన ‘బ్రోకర్- 2’లో స్టోరీకి టర్నింగ్ పాయింట్ ఇచ్చే క్యారెక్టర్ నాది.
సాక్షి : భవిష్యత్తు ప్రాజెక్ట్సు గురించి..
వెంకట్ : ఒక సినిమాలో బుక్ అయ్యా. ఇంకా ఆ సినిమాకి పేరు పెట్టలేదు.
సాక్షి : ప్రస్తుతం చేస్తున్న సీరియల్స్?
వెంకట్ :‘ఈ నేల - ఈ గాలి’ సీరియల్‌లో తొలిసారిగా హీరోగా నటిస్తున్నా. హీరోగా సినిమా అవకాశాలు వస్తున్నా.. కథ నచ్చి సీరియల్ చేయడానికి ఒప్పుకొన్నా. ఇప్పుడు ఎక్కువగా వస్తున్న అత్తాకోడళ్ల సీరియల్స్‌కు చెక్ చెప్పేందుకు ఇలాంటి ఆదర్శవంతమైన సీరియల్‌ను నిర్మాత చల్లపల్లి అమరప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆయన కోసమే చేస్తున్నా. అలాగే, మా టీవీలో వచ్చే సీతామహాలక్ష్మీ సీరియల్‌లో అభి క్యారెక్టర్ చేస్తున్నాను.
సాక్షి : గతంలో సీరియల్స్‌లో నటించారా?
వెంకట్ : సింధూరపువ్వు, ఆడదే ఆధారంలో నటించా.
సాక్షి : యానిమేషన్ రంగంలో ఉన్న మీరు నటనారంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు?
వెంకట్ : నటన అంటే నాకు మక్కువ ఎక్కువ. యానిమేటర్‌గా రూ.30వేల జీతానికి పనిచేస్తూనే డ్యాన్స్‌తో పాటు జిమ్‌లో బాడీబిల్డ్ చేశాను. నటనకు దగ్గర కావాలని జాబ్ వదులుకుని బయటకు వచ్చేశాను. ప్రస్తుతం హీరోగా పనిచేసేందుకు ఆశ్రమ ఉపయోగపడింది.
సాక్షి : కొత్త నటులకు మీరిచ్చే సలహా?
వెంకట్ : కృషిచేస్తే కళామతల్లి అదృష్టం ఎప్పటికైనా వరిస్తుంది. సాధనే ముఖ్యం. అప్పుడే విజయం సొంతమవుతుంది.