వంట గ్యాస్ సబ్సిడీ చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం దొంగదెబ్బ తీస్తోంది. పారదర్శకత ముసుగులో వినియోగదారుడిపై భారం మోపుతోంది. ఫలితంగా జిల్లాలోని 2.70 లక్షల మంది వినియోగదారులు సిలిండర్‌కు 89 రూపాయల చొప్పున సొంత జేబులోంచి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
జనం నెత్తిన గ్యాస్ బండ!
Aug 23 2013 4:03 AM | Updated on Sep 27 2018 5:56 PM
వంట గ్యాస్ సబ్సిడీ చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం దొంగదెబ్బ తీస్తోంది. పారదర్శకత ముసుగులో వినియోగదారుడిపై భారం మోపుతోంది. ఫలితంగా జిల్లాలోని 2.70 లక్షల మంది వినియోగదారులు సిలిండర్‌కు 89 రూపాయల చొప్పున సొంత జేబులోంచి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు.. ఇప్పటివరకు సిలిండర్‌కు 25 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కొనసాగుతుందో.. లేదో స్పష్టత లేదు. ప్రభుత్వం దీనిని ఉపసంహరించుకుంటే ఆ భారాన్ని కూడా వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది.
టెక్కలి, న్యూస్‌లైన్: వంట గ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారుడికి చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ టు ఎల్పీజీ కన్జూమర్స్(డీబీటీఎల్) పథకాన్ని రూపొందించింది. తొలివిడతలో రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, అనంతపురం, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేసింది. సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, ఆదిలాబాద్, వైఎస్సార్ కడప, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో అమలు చేయనుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులకు, గ్యాస్ ఏజెన్సీలకు ఉత్తర్వులు జారీ ఆయ్యాయి. పత్రికల్లో భారీ ప్రకటనలు కూడా వచ్చాయి. నగదు బదిలీ పథకం అమలుతో వినియోగదారుడికి నేరుగా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది.
భారం పడేది ఇలా..
ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీలతో కలిపి జిల్లాలో 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్‌ను 411 రూపాయలకు విక్రయిస్తున్నారు. సబ్సిడీ లేని సిలిండర్ ధర ప్రస్తుతం 935 రూపాయలు. ఆథార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్‌తో గ్యాస్ కనెక్షన్‌ను అనుసంధానం చేసిన వినియోగదారులకు వచ్చే నెల 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకం కింద ఒక్కో సిలిండర్‌కు 435 రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కానుంది. ప్రస్తుతం సిలిండర్ మార్కెట్ ధర 935 రూపాయలు కాగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ 435 రూపాయలే. మిగిలిన 500 రూపాయలను వినియోగదారుడే భరించాలి. అంటే ప్రతి సిలిండర్‌కు 89 రూపాయలను సొంత జేబులోంచి ఖర్చుచేయాలి. మరోవైపు.. సిలిండర్ మార్కెట్ ధర ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇది పెరిగితే ఆ భారాన్ని కూడా వినియోగదారుడే భరించాలి.
రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ చెల్లింపుపై అస్పష్టత
గతంలో వంటగ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరగటంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో సిలిండర్‌పై 25 రూపాయలను రాష్ట్రప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించి ప్రజలకు ఊరట కలిగించారు.
ఇప్పుడు నగదు బదిలీ పథకం అమలవుతున్న నేపథ్యంలో మహానేత ఇచ్చిన 25 రూపాయల సబ్సిడీని ఎత్తివేసేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. అదే జరిగితే ఆ భారం కూడా వినియోగదారుడే భరించాల్సి వస్తుంది.
ఆదేశాలను అమలు చేస్తాం..
ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల అధికారి ఆనంద్‌కుమార్‌ను ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తామని చెప్పారు. జిల్లాలోని 2,69,471 మంది గ్యాస్ వినియోగదారుల్లో 2,58,327 మందికి సంబంధించి ఆధార్ అనుసంధానం పూర్తయిందని వెల్లడించారు. వీరందరికీ వచ్చే నెల 1 నుంచి నగదు బదిలీ పథకం వర్తిస్తుందని వివరించారు.
Advertisement
Advertisement