
విభజనపై హైకమాండ్ తర్జన భర్జన: మంత్రి పితాని
సీమాంధ్ర ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ హైకమాండ్ తర్జన భర్జన పడుతోందని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు.
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ హైకమాండ్ తర్జన భర్జన పడుతోందని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. సమైక్యరాష్ట్ర ఉద్యమ తీవ్రతను హైకమాడ్ గమనిస్తోందని చెప్పారు. విభజన ప్రక్రియ వేగవంతం అవుతుందన్న కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలతో సీమాంధ్రుల్లో ఆందోళన పెరిగిందన్నారు. ఉద్యమ తీవ్రతను తగ్గించి, ఇబ్బందులను తొలగించి సమస్యను పరిష్కరించాలని చూస్తుందని పేర్కొన్నారు.
ఇరు పక్షాల ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపి సామరస్య వాతావరణం తీసుకురావడంపై అధిష్టానం దృష్టి సారించిందని చెప్పారు. విభజనకు అసెంబ్లీలో తీర్మానం రాజ్యంగ పరంగా తప్పని సరి అన్నారు. అప్పుడు ప్రాంతాలవారిగా ఎమ్మెల్యేలు తమ ప్రజల అభీష్టం మేరకే వ్యవహారిస్తారని చెప్పారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తారా లేదా అనేది కేంద్రమే చెప్పాలన్నారు. ఏపీ ఎన్జీవోల సభకు పిలిస్తే వెళ్లడంపై ఆలోచిస్తామని చెప్పారు. ఏపీఎన్జీవోల సభను తెలంగాణవాదులు వ్యతిరేకించడం బాధాకరం అన్నారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతివ్వడం వెనుక సీఎం హస్తం లేదని మంత్రి పితాని చెప్పారు. ఏపీఎన్జీవోల సభతో తలెత్తే పరిణామాలను అనుమతిచ్చినవారే చూసుకుంటారన్నారు.