హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.రవిశంకర్ బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది.
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.రవిశంకర్ బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఇందుకోసం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తోపాటు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. జస్టిస్ రవిశంకర్ న్యాయవ్యవస్థకు అందించిన సేవలను ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ కొనియాడారు. అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ ఇన్నేళ్ల తన న్యాయవ్యవస్థ ప్రస్థానంలో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత న్యాయవాదుల సంఘం ప్రతినిధులు జస్టిస్ రవిశంకర్ దంపతులను ఘనంగా సన్మానించారు. వారికి ప్రధాన న్యాయమూర్తి జ్ఞాపికను బహూకరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు వేణుమాధవ్, కార్యదర్శులు పాశం కృష్ణారెడ్డి, డి.ఎల్.పాండు, సంయుక్త కార్యదర్శి పీఎస్‌పీ సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ రవిశంకర్ 1951 ఆగస్టు 16న గుంటూరులో జన్మించారు. 1975లో ఉస్మానియా వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1976లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. తన తండ్రి ఎన్.చంద్రమౌళి వద్ద జూనియర్‌గా చేరి వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. కొంతకాలం హైకోర్టులో ప్రభు త్వ న్యాయవాదిగా పనిచేశారు. తర్వాత న్యాయాధికారిగా ఎంపికయ్యారు. 1995లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. 15.11.2000 సంవత్సరంలో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2012 జనవరి 19న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.