బంజారాహిల్స్‌లో భూమి అంత చౌకా?
చ.గజం రూ.100 చొప్పునే కేటాయించేస్తారా?
బహిరంగ వేలం లేదు... మార్కెట్ రేటూ లేదు
పార్టీలకు చౌకగా కేటాయింపులపై హైకోర్టు విస్మయం
ఎవరి ఆదేశాలతో, ఏ ప్రాతిపదికన కేటాయించారు?
నివేదికివ్వాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి మీనాకు ఆదేశం
పార్టీలను ప్రతివాదులుగా చేర్చి, వాటికి నోటీసుల జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో భూమిని చదరపు గజం రూ. 100 చొప్పున విక్రయించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విలువైన భూములకు వేలం నిర్వహించి, కోట్ల రూపాయలను ఖజానాకు జమ చేయాల్సింది పోయి ఇలా నామమాత్రపు ధరకు విక్రయించడం, కనీసం మార్కెట్ ధర కూడా వసూలు చేయకపోవడం విస్మయం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)కి బంజారాహిల్స్‌లో ఎకరా (4,840 చదరపు గజాలు) భూమిని చదరపు గజం రూ. 100 చొప్పున విక్రయించినట్లు రికార్డుల్లో ఉండటాన్ని గమనించిన హైకోర్టు ఈ విధంగా స్పందించింది. రాజకీయ పార్టీలకు ఎవరి ఆదేశాలతో ఆ భూములు కేటాయించారు? ఏ ప్రాతిపదికన కేటాయింపు జరిగింది? తదితర వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ను వారంలోగా దాఖలు చేయాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక భూములు పొందిన అన్ని పార్టీలను ప్రతివాదులుగా చేరుస్తూ, వాటన్నింటికీ నోటీసులు కూడా జారీ చేసింది.
నెల్లూరు జిల్లా గూడూరులో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)కి దాదాపు ఎకరా భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం 2009లో జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ వి.గోపీకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఇప్పటివరకు ఏయే రాజకీయ పార్టీలకు ఎక్కడెక్కడ, ఎంతెంత మేర స్థలాలు కేటాయించారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని గత విచారణలో ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా మంగళవారం కోర్టు ముందు హాజరయ్యారు. ఏయే పార్టీలకు ఎక్కడెక్కడ భూములు కేటాయించిందీ పేర్కొంటూ ఒక నివేదికను ఆయన ధర్మాసనం ముందుంచారు. మొత్తం 16 చోట్ల కేటాయింపులు జరిగాయని, వాటిని పొందినవాటిలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పి.శ్రీధర్‌రెడ్డి ధర్మాసనానికి నివేదించారు.
ఈ నివేదికను ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. టీఆర్‌ఎస్‌కు బంజారాహిల్స్‌లో ఎకరా భూమిని చదరపు గజం రూ. 100 చొప్పున విక్రయించినట్లు ఉన్న విషయాన్ని గమనించింది. బంజారాహిల్స్‌లో చదరపు గజం భూమి రూ. 100 కేనా? అంటూ విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేసే భూ కేటాయింపులకు కనీసం మార్కెట్ ధర అయినా నిర్ణయించాలని, ప్రస్తుత కేసులో కేటాయింపులు, విక్రయాల తీరు చూస్తుంటే అసలు మార్కెట్ రేటును పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించట్లేదని వ్యాఖ్యానించింది. ఈ కేటాయింపులన్నీ ఎవరు చెబితే చేశారు... ఏ ప్రాతిపదికన కేటాయించారో... ఆయా వివరాలను పరిశీలించిన తరువాతే ఈ కేసులో తుది ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
పార్టీలకు కాకుంటే కార్పొరేట్లకు ఇస్తారా?: నారాయణ
రాజకీయ పార్టీల కార్యాలయాలకు కాకుండా కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాలు ఇస్తారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుపై ఆయన స్పందించారు. విలువైన భూములను లాభాపేక్షతో నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థలకు ఎకరా రూపాయికి ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలియదా? అని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. కోర్టు తీర్పులను సీపీఐ గౌరవిస్తుందంటూనే.. అవసరమైతే అత్యున్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.